బాలిక జమున కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
గిరిజన గూడేల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వ వైఫల్యం వల్ల మలేరియా మందులు వికటించి పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ఒక చిన్నారి మృతి చెందడం, పదుల సంఖ్యలో గిరిజన పిల్లలు అస్వస్థతకు గురికావడం అత్యంత ఆందోళనకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో బాలిక మృతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ‘గిరిజన సంజీవని’ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ డొల్లతనం ఈ ఘటనతో బట్టబయలైందని విమర్శించారు. గిరిజనుల రక్షణ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కనీస వైద్య సేవలు అందక గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గిరిజనులకు ఇచ్చిన క్లోరోక్విన్ మందుల బ్యాచ్ ఎక్స్‌పైరీ తేదీ 2028 అని అధికారులు చెబుతున్నప్పటికీ, ఏ పద్ధతిలో పరీక్షలు చేయకుండా గ్రామంలో 52 మందికి ఒకేసారి ట్యాబ్లెట్లు వేశారని, ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ (Drugs and Cosmetics Act, 1940) నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వైద్య శిబిరాలు నిర్వహించడం క్రిమినల్ నెగ్లిజెన్స్ (Criminal Negligence - IPC Sec 304A) కిందకు వస్తుందని తెలిపారు దీనికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు బాధ్యత వహించాలని, మృతి చెందిన బాలిక మడివి జమున మృతదేహానికి అర్ధరాత్రి పూట హడావుడిగా పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో తెలపాలని కోరారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మినహా సూర్యాస్తమయం తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించడానికి వీలు లేదని, ప్రభుత్వ వైద్యులు ఎవరి ఒత్తిళ్లతో ఈ నిబంధనలను ఉల్లంఘించారో చెప్పాలని డిమాండ్ చేశారు.మృతికి అసలు కారణాలను కప్పిపుచ్చడానికి రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టం పూర్తిచేసి వాస్తవాలు దాచాలని చూస్తున్నారని తెలిపారు.
బాధితులను, మృతి చెందిన జమున కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న సిపిఎం నాయకులను పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, కనీస మానవ హక్కులను కాలరాస్తూ గొల్లగుప్ప గ్రామంలోకి ఎవరినీ వెళ్లకుండా నిర్బంధకాండ ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, రోడ్లు వేస్తాం, కరెంట్ ఇస్తామని ఫోటోలకు ఫోజులిచ్చి ఆదివాసీలను మోసం చేస్తూ దాన్నే అభివృద్ధిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ‘సంజీవని’ కార్యక్రమాలు కార్పొరేట్ శక్తులకూ, అధికారుల ప్రచార ఆర్భాటాలకా లేక రోగాలతో మగ్గుతున్న గిరిజనుల ప్రాణాలు కాపాడటానికా? సమాధానం చెప్పాలని కోరారు. మృతి చెందిన బాలిక మడివి జమున కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలు అందేలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, గిరిజన గూడేల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)