ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తీవ్ర సమస్యలు

04 జులై, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 06:53 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- నిబంధనలను సడలించాలి

- గడువు మరో నెల పొడిగించాలి

- సిఇఓకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ

అమరావతి బ్యూరో

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గ్రామ/ వార్డు సభలు పెట్టడం, గడువు పొడిగించడంతోపాటు నిబంధనలను సడలించాలని, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి లేఖ రాశారు. సిపిఎం నాయకత్వం క్ష్రేత్రస్థాయి పర్యటనలో ప్రత్యక్ష పరిశీలనలో వచ్చిన అంశాలను లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియలో భాగంగా 2002 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిర్వహిస్తున్నారని, ఇప్పటికే దాదాపు 60 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ప్రక్రియ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ప్రామాణిక గుర్తింపు కార్డులను నిరాకరణ

గ్రామాల్లో ప్రజల వద్ద నిత్యం అందుబాటులో ఉండే అత్యంత ప్రామాణిక పత్రాలైన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు ప్రాతిపదికగా తీసుకోవడం లేదని, చట్టబద్ధమైన ఈ కార్డులను కాదని, ఇతర పత్రాలను అడగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే అందుబాటులో లేని లేదా పాత పత్రాలను డిమాండ్ చేస్తున్నారని, వెరిఫికేషన్ నిబంధనల పేరుతో విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, కుల లేదా జనన ధృవీకరణ పత్రాలను అధికారులు తప్పనిసరిగా కోరుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 2002 తర్వాత జన్మించిన వారిని తమ పూర్వీకుల వివరాలు సమర్పించాలని, వివాహమైన మహిళలను వారి పుట్టింటి తల్లిదండ్రు ల సమాచారం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. గ్రామాల్లో వృద్ధులు, నిరక్షరాస్యులు, పేద ప్రజల వద్ద దశాబ్దాల క్రితం నాటి ఇటువంటి సర్టిఫికెట్లు లేవని, ఒకవేళ ఉన్నా, ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడం వల్ల వాటిని సేకరించడం వారికి అత్యంత కష్టతరంగా మారిందని పేర్కొన్నారు.

వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల ప్రజల దయనీయ స్థితి

గత 24 ఏళ్లలో ఉపాధి నిమిత్తం ఎంతో మంది వలసలు వెళ్లడం, ఇళ్లు మారడం జరిగిందని వివవరించారు. ఇప్పుడు హఠాత్తుగా 2002 నాటి రికార్డులను ప్రామాణికంగా అడగడం వల్ల ఎంతోమంది అర్హులైన పేద ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. సొంత ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారు, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు, విదేశాలకు వెళ్ళిన ఎన్‌ఆర్‌ఐలు ఈ నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. చట్టప్రకారం 12 సంవత్సరాల నుండి స్థానికంగా నివసిస్తున్న వారికి పౌరసత్వం/ స్థానికత లభిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిందని, కాబట్టి నిబంధనలు సడలించాలని కోరారు.

ఆర్థిక, మానసిక ఇబ్బందులు

ఈ సర్వే నిరూపణల కోసం పేద ప్రజలు తమ రోజువారీ కూలీ పనులను మానుకోవాల్సి వస్తోందని, పాత సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, దళారుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అనేక కుటుంబాలకు ఫారాలు కూడా సరిగ్గా అందలేదని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో సాధారణ ప్రజలకు పత్రాలు పూర్తి చేసుకోవడం కష్టంగా ఉందని, 2002 ఓటర్ల జాబితాలో పేర్లు ఆన్‌లైన్‌లో చూసి అదనపు ఆధారాలు ఇవ్వవలసిన అవసరం ఉంటే ఓటర్లకు అప్పుడే చెప్పాలని సూచించారు. సిఇఓ వెంటనే స్పందించి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. క్లిష్టమైన పాత సర్టిఫికెట్లకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ప్రజల వద్ద అందుబాటులో ఉన్న ఆధార్‌కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను ప్రాధాన్యత గుర్తింపు పత్రాలుగా అంగీకరించేలా నిబంధనలను సడలించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా జరిగి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు జరగాలంటే ఈ ప్రక్రియను కనీసం నెలరోజులు పొడిగించాలని కోరారు. పత్రాలు ఆమోదించారా? లేదా? పరిశీలించి ఓటర్లకు చెప్పాలని, ఆధారాలు సరిపోని యెడల ఓటర్లకు తెలపాలని లేఖలో ప్రస్తావించారు. నిబంధనలను సరళతరం చేసి, రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కును నష్టపోకుండా చూడాలని, వలసలు వెళ్ళినవారికి, విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు పారదర్శకంగా ఉండే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందించి ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించేందుకు గ్రామ/ వార్డు సభలు పెట్టాలని, ప్రజలకు తెలుసుకునే హక్కును గౌరవించాలని ముందుగా ప్రతి గ్రామం/ పేటలో అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని కోరారు. బిఎల్‌ఓలపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆ రీత్యా తప్పులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వివరించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని, పౌరుల ఓటు హక్కును కాపాడాల్సిన తరుణంలో హడావుడిగా పని ముగించడం సరికాదని, ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, దాన్ని గౌరవించాలని కోరారు. ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకుని, క్షేత్రస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని శ్రీనివాసరావు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్