Nov 24,2022 06:44
  • 2024లోపు ఉమ్మడి సమస్యలు పరిష్కరించాలని సిఎస్‌ విజ్ఞప్తి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీతో జరిగిన సమావేశంలో అసంపూర్తిగానే ముగిసింది. విభజన సమస్యలపై సిఎస్‌ ఆధ్వర్యాన అధికారుల బృందం బుధవారం కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన పలు అంశాలపై సిఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ క్యాబనెట్‌ సెక్రటరీకి వివరించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు ఆర్థిక వివరాలను కార్యదర్శికి సమర్పించినట్లు తెలిసింది. వీటిని పరిశీలించి నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరినట్లు సమా చారం. విశాఖపట్నం రైల్వేజోన్‌, రామాయ పట్నం ఓడరేవు, కడప స్టీలు ప్లాంటు ప్రతిపాదనలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరినట్లు తెలిసింది. విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన,ఆర్థిక వ్యవ హారాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపి నట్లు సమా చారం. ముఖ్యంగా తెలం గాణా నుండి రావాల్సిన విద్యుత్‌ బిల్లుల అంశాన్ని సిఎస్‌ లేవనెత్తారు. చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్లు గడవకముందే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు జూన్‌ 2, 2024 నాటికి ముగియనుందని, అప్పటి నుండి తెలంగాణా రాజధానిగా మారుతుందని, అప్పట్లోపు సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలని కోరినట్లు సమాచారం. విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని సిఎస్‌ కేంద్రాన్ని కోరారని సమాచారం.