
రామచంద్రపురం (తిరుపతి జిల్లా) : రాయల చెరువు కట్టపైన ఆహ్లాదకర వాతావరణంలో నాలుగో విడత రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. మంత్రి రోజా మాట్లాడుతూ .... ఆపదలో ఉన్న రైతుకు ఇచ్చే ఆపన్న హస్తమే జగనన్న రైతు భరోసా అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు నేతగా రైతులకు భరోసాగా ఉన్నారనీ, తరువాత మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యి రైతులకు అండగా నిలిచారని చెప్పారు. రైతు భరోసాగా రూ.13,500 ప్రతి సంవత్సరం అందిస్తున్నారని అన్నారు. బాదుడో బాదుడు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు.. నేనున్నానని జగన్ మోహన్ రెడ్డి భరోసానిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయమే అవసరం లేదంటూ చంద్రబాబు బుక్ రాశారనీ, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.2,000 కోట్లలో కూడా రైతుల సంక్షేమానికి జగన్ మోహన్ రెడ్డి వినియోగించారని తెలిపారు. ఈ రోజు రైతుల కోసం రైతు భరోసా కార్యక్రమంలో 50 లక్షల మంది రైతులకు రూ. 3,758 కోట్లు అందిస్తున్నారని అన్నారు.
అనంతరం ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ... జై జవాన్, జై కిసాన్.. దేశానికి రక్షణ జవాన్ అయితే.. ప్రజల ఆకలి తీర్చే రైతును జై కిసాన్ అని కొనియాడారు. రైతు ధనవంతుడైతే.. ఆ దేశం ధనిక దేశం అవుతుందన్నారు. వ్యవసాయం పక్కదారి పడితే ఏ విభాగం కూడా సరైన దారిలో నడవబోదని స్వామినాథన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం జనం మదిలో చిరస్మరణీయంగా తన తండ్రిని నిలుపుతూ సిఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రైతులే దేవుళ్ళు.. రైతు భరోసా కేంద్రాలే దేవాలయాలు.. అన్న సిఎం జగనన్న అందుకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ' నేను ఉన్నాను.. నేను విన్నాను ' అంటూ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ... గత ముఖ్య మంత్రి పసుపు కుంకుమ మాత్రమే ఇచ్చారనీ, సిఎం జగనన్న రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల వారికి అన్నీ ఇచ్చారనీ అన్నారు. ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ... 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో సిఎం జగనన్నకు రైతు తమ కన్నీటి గాధలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఉచిత భీమా, అన్ని రకాల సేవలను అందించారన్నారు. బాధ్యతాయుత ప్రభుత్వం అనిపించుకుంటోందన్నారు. సమర్థవంతమైన ల్యాబ్ వ్యవస్థ తీసుకొచ్చారన్నారు. సున్నా వడ్డీతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం చిత్తూరు ఎంపి రెడ్డప్ప, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ్.. మాట్లాడారు.
అనంతరం సిఎం జగనన్న ప్రారంభించిన నాలుగో విడత రైతు భరోసా కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చారు. తిరుపతి జిల్లా నాలుగో విడత రైతు భరోసా ప్రారంభోత్సవ సభ నిర్వహణ పట్ల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొనియాడారు.
ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో ఎపి టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి చిత్తూరు ఎంపీ మద్దెల గురుమూర్తి, రెడ్డప్ప, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, పలమనేరు వెంకట్ గౌడ్, అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ తిరుపతి జిల్లా ఛైర్మెన్ రఘునాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.