Jul 29,2021 06:58

ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తున్న వారికి కేంద్రం అనుమతిచ్చిన పరిమితి కంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పు చేసిందంటూ ఆర్థికశాఖ సహాయమంత్రి పార్లమెంటులో చెప్పిన విషయం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్క ఏడాదిలోనో, ఒక్క నెలలోనో క్షీణించింది కాదు. కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రయాణ ఫలితం ఇది! అయితే, ఈ దుస్థితికి కారణం ఎవరు? దీని నుండి బయటపడటం ఎలా? అన్నవి కీలక ప్రశ్నలు! నిజానికి రాష్ట్రాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, వాటి హక్కులపై దాడి చేయడానికి ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ఒక ఆయుధంగా వినియోగిస్తోంది. ఆర్థికవనరులన్నింటినీ గుప్పెట పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధుల కోత విధిస్తూ వస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థికసంఘం నిధులకు సైతం ప్రాతిపదికలు మార్చి కత్తిరిస్తోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశే కాదు, అనేక రాష్ట్రాలు రుణాల చక్రబంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయడమంటేనే అదనపు అప్పునకు అనుమతి ఇవ్వడంగా ఇటీవల కాలంలో ఆర్ధం మారిపోయిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థలు, విద్య, విద్యుత్‌తో పాటు అనేక రంగాల్లో సంస్కరణల అమలుకు ఈ పద్ధతినే కేంద్రం పాటించింది. కేంద్రం తమ హక్కులను కబళిస్తోందని, అప్పుల ఆశచూపి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని తెలిసి కూడా ప్రతిఘటించకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తలలూపడం విచారకరం. దిగజారిన ఆర్థిక వ్యవస్థతో పాటు కరోనా కష్టాలతో నిధులు లేక నీరసించిన రాష్ట్రాలకు గడ్డు పరిస్థితే! కేంద్ర ప్రభుత్వం ఆదేశించినందువల్లే పట్టణాల్లో ఆస్తిపన్ను పెంచాల్సివచ్చిందంటూ రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు పదేపదే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రజలపై భారాలు మోపే సంస్కరణల అమలుకోసమైతే ఎంత అప్పుకైనా అనుమతిస్తారా? అప్పుడు నిబంధనలు గుర్తురావా? నిజానికి ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు అమలులోకి తీసుకువచ్చిన ద్రవ్య నియంత్రణ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టమే రాష్ట్రాల హక్కుల్లోకి చొరబాటు. దానిని అడ్డం పెట్టుకుని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు మరింతగా రాష్ట్రాలను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సమైక్య రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే! రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారిదే! కానీ జరిగిందేమిటి? హళ్లికి హళ్లి...సున్నకు సున్న! పార్లమెంటులో సాక్షాత్తు ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటు పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందిన పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం చాపచుట్టేసింది! పోలవరం ముంపు గ్రామాలను రాష్ట్రంలో కలిపామంటారు! పునరావాసానికి నిధులిమ్మంటే లేవు పొమ్మంటారు! ఇదెక్కడి న్యాయం! ప్రాజెక్టు ఎలా పూర్తి కావాలి? అభివృద్ధి ఎలా సాకారం కావాలి? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నుండి, విశాఖ రైల్వేజోన్‌ వరకు ఒక్కటంటే ఒక్కటి అమలు జరిగిందా? జరిగిఉంటే నేటి ఈ దుస్థితి ఉండేదా? ఉద్యోగాలేవి? కొత్త పరిశ్రమలేవి? ఉపాధి అవకాశాలు ఎక్కడీ విభజన నాటికే లోటు బడ్జెట్‌లో ఉండి, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఆదుకునే పద్ధతి ఇదేనా? రాజధాని కట్టుకుంటామంటే చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి చేతులుదులుపుకున్న తీరును రాష్ట్ర ప్రజలు ఇప్పుడప్పుడే మరచిపోగలరా? ఇవన్నీ పక్కనపెట్టి పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ సుద్దులు చెప్పడం గురివింద గింజ సామెతను గుర్తుచేయదా?
రాష్ట్రంలోజగన్‌ సర్కారు తీరులో కూడా మార్పు రావాలి. అప్పులు తెచ్చైనా సంక్షేమ పథకాలు కొనసాగించడం కరోనా కష్టకాలంలో ప్రజానీకానికి ఎంతో కొంత ఊరటనిచ్చే చర్యే! అయినా, ఇదొక్కటే చాలదు.అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి. అదనపు అప్పుకోసం ప్రజలపై భారాలు మోపే సంస్కరణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. ప్రత్యేకహోదాతో పాటు పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీల సాధనకోసం కేంద్రం మెడలు వంచడానికి సిద్ధపడాలి. దీనికోసం కలిసివచ్చే వ్యక్తులను, సంస్థలను, పార్టీలను కలుపుకోవాలి. ఈ తరహా చర్యలే రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలను అందిస్తాయి.