Apr 20,2021 21:15

మాట్లాడుతున్న జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృపావరం

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ : అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి సిహెచ్‌.కృపావరం అన్నారు. అగ్నిమాపక భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలోని అగ్నిమాపకశాఖ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను నిర్వహించామని వివరించారు. ఇందులో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలు సంభవించిన సమయంలో నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాద భద్రతా పరికరాలను సైతం పరిశీలించామని చెప్పారు. జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో సకాలంలో అక్కడకు చేరుకుని ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా అగ్నిమాపకశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎడిఎఫ్‌ఒ, బిజెడిఎస్‌ ఎస్‌.ప్రశాంత్‌ కుమార్‌, శ్రీనుబాబు పాల్గొన్నారు.
పాలకొండ : అజాగ్రత్త వల్లే అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని అగ్నిమాపక ఇన్‌ఛార్జి అధికారి వై.గోవిందరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో భాగంగా స్థానిక ఫైర్‌స్టేషన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలను నిలుపరించడంలో అశువులు బాసిన సహోద్యోగులకు నివాళులు అర్పించారు. వేసవిలో ప్రమాదాలు అధికంగా సంభవిస్తాయని, వీటిని అధిగమించేందుకు అవగాహన అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూరిళ్లు కలిగిన వారు వంట చేసేటప్పుడు, విద్యుత్‌ పరికరాలు వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిశ్రమలు, థియేటర్లు, పాఠశాలల్లో అగ్నిమాపక నిబంధనలు తప్పనసరిగా అమలు చేయాలన్నారు.
పలాస : అగ్నిమాపక కేంద్ర ఆవరణలో స్థానిక గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పాఠశాలలో, కళాశాలలో అగ్నిప్రమాద నివారణకు నిరోధక సాధకాలు కచ్చితంగా ఉండాలని అగ్నిమాపక శాఖాధికారి ఎంఎస్‌వి రవిప్రసాద్‌ అన్నారు.