Sep 15,2021 21:18
సమావేశంలో మాట్లాడుతున్న యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో : కేంద్రం అమలు చేస్తోన్న విద్యుత్‌ సంస్కరణలు డిస్కం సంస్థ ఉనికికే ప్రమాదంగా మారిందని, వెంటనే విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఎపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. తిరుపతి బాలాజీ కల్యాణ మండపంలో యూనియన్‌ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి విఎస్‌ఆర్‌కె గణపతి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జగదీష్‌, డిస్కం కార్యదర్శి వి.దేవేంద్రరెడ్డి, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షులు వై.కృష్ణమూర్తి, డిస్కం సలహాదారు ప్రభుదాసు హాజరయ్యారు. పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, కార్మికుల ఆమోదయోగ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కరోనా వల్ల నిలిపేసిన డిఎలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి విఎస్‌ఆర్‌కె గణపతి మాట్లాడుతూ.. జెఎల్‌ఎం గ్రేడ్‌ 2 ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా గవర్నమెంట్‌ తీసుకున్నా... వారి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో రెండేళ్ల ప్రొబెషనరీ కంప్లీట్‌ అయిన తర్వాత రెగ్యులర్‌ చేస్తామని చెప్పారన్నారు. వారు ఎలాంటి అభద్రతా భావానికి గురికావద్దని, యూనియన్‌పరంగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఎస్‌పిడిసిఎల్‌ శాఖ ఎన్నిక జరిగింది. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. డిస్కం సెక్రటరీగా వి.దేవేంద్రరెడ్డి, ప్రెసిడెంట్‌గా పి.చంద్రశేఖర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వై.కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, డిస్కమ్‌ ఆఫీసు బేరర్స్‌ హాజరయ్యారు.