May 17,2022 22:44

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపుదామని మాజీ ఎమ్మెల్యేలు జితేంద్ర గౌడ్‌, కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. మంగళవారం కదిరి రూరల్‌ సమీపాన కౌలేపల్లి గేట్‌ వద్ద గల న్యూ నేహా ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టిడిపి క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పర్యవేక్షకులుగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌, ఆలం నరసానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకం, దౌర్జన్యం రాజ్యమేలుతోందని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేసిందని అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక కంపెనీ అయినా నెలకొల్పలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కన్వీనర్లు,మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.