May 15,2022 01:08
మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-రేపల్లె
రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి జాడే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సామాజికవర్గ ప్రజలు కూడా సంతప్తికరంగా లేరని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రులు వైసీపీకి ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఉన్నవన్నీ ఊడ్చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేద మధ్య తరగతి వర్గాల జీవనం దుర్భరంగా మారిందని ఆరోపించారు. ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకోకుండా పన్నులు ధరల పెంపుతో ప్రజల నుంచి ఆదాయం సమకూర్చుకునే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లో ఇసుక మాఫియా, డ్రగ్స్‌ మాఫియాలో వైసీపీ నేతలు ముఖ్య పాత్ర పోషిస్తూ తీరప్రాంతంలో అరాచకం సష్టిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలను పెంచడంతోపాటు ఇంధనం నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దుయ్యబట్టారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో అత్యాచారాలు, అరాచకాలకు నిలయంగా మారింది అనడానికి నిదర్శనం ఇటీవల బాపట్ల జిల్లాలో మహిళలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాలు హత్యలు ఇందుకు నిదర్శనమని శ్రీనివాసరావు ఆరోపించారు.
రేపల్లెలో రెవెన్యూ సబ్‌ డివిజన్‌ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని, అయితే రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర అధికారులకు లేఖలు, వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగిందని అయితే వైసిపి నాయకులు నైతిక విలువలు మరచి తామే రెవెన్యూ డివిజన్‌ సాధించామని సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే, రేపల్లె పట్టణ అభివద్ధి జరిగిందె తప్ప, వైసిపి ప్రభుత్వం 3సంవత్సరాల కాలంలో రేపల్లె పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు.
టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్‌ నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ముందంజలో ఉన్నారని అయితే ప్రస్తుత పాలకులు తామే నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధికి నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కువమందికి లబ్ధిదారులకు భరోసా మంజూరు చేయడం జరిగింది అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప మత్స్యకారులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పట్టాభిరామారావు, జివి నాగేశ్వర రావు, ధర్మ తేజ, కాన్సిలర్‌ ఏ.రామకృష్ణ రాష్ట్ర మైనార్టీ నాయకులు ముస్తఫా, శివసుబ్రహ్మణ్యం, నల్లూరి అజరు కుమార్‌, దేవగిరి రవిశంకర్‌, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షులు పి.గోపి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.