
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జగనన్న కాలనీల్లోని అర్బన్ ప్రాంతాల ఇళ్ల నిర్మాణాల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి రెండేళ్లయినా శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో కనీసం సగం కూడా పూర్తి కాలేదు. పట్టణ ప్రాంతాలకు దూరంగా స్థలాలు ఇవ్వడం ఒక కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు అత్యధికులు తమ స్థలాలను ఆస్తిగా పరిగణిస్తున్నారు తప్ప ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధపడకపోవడం మరో కారణంగా ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థికసాయం కూడా సరిపోకపోవడంతో లబ్ధిదారులు అప్పు చేసేందుకు ఇష్టపడక ముందుకు రావడం లేదు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా 74,654 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 7,625 ఇళ్లు ప్రారంభం కాలేదు. వీటిలో బిబిఎల్ (బిలో బేస్‌మెంట్ లెవల్) దశలో 24,437 ఇళ్లు, పునాది దశలో 10,294, పైకప్పు దశలో 5,256 ఇళ్లు ఉన్నాయి. శ్లాబ్ పూర్తయినవి 4,333 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 22,705 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగాయి. మొత్తం 67,025 ఇళ్లు (89.8 శాతం) గ్రౌండింగ్ అయ్యాయి. పునాది, అంతకుమించి స్థాయి దాటినవి 42,588 ఇళ్లు (57 శాతం) ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చాలా మందకొడిగా ఉన్నాయి. ఆమదాలవలసలో 2,742 ఇళ్లు మంజూరు చేయగా పునాది, ఆ దశ దాటినవి 860 ఇళ్లు (31.4 శాతం) ఉన్నాయి. శ్రీకాకుళం నగరం పరిధిలో ఉన్న 11,272 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించగా పునాది దాటినవి 4,191 ఇళ్లు (37.2 శాతం) మాత్రమే ఉన్నాయి. ఇచ్ఛాపురం పట్టణంలోని 2,287 మంది పేదలకు ఇళ్లు కేటాయించగా పునాది, ఆ తర్వాత స్థాయి దాటినవి 993 ఇళ్లు (43.4 శాతం) ఉన్నాయి. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 3,389 మందికి ఇళ్లు కేటాయించగా 1489 ఇళ్లు (43.9 శాతం) పునాది, ఆ తర్వాత దశ దాటి ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కాస్త బాగు
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి కొంత బాగానే ఉంది. జలుమూరు మండలానికి 1708 ఇళ్లు కేటాయించగా పునాది స్థాయి దాటినవి 1421 ఇళ్లు (83.2 శాతం) ఉన్నాయి. లావేరులో 2,644 ఇళ్లకు గానూ 2094 ఇళ్లు (79.2 శాతం) పునాది స్థాయి దాటి ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలానికి 1261 ఇళ్లు కేటాయించగా 997 ఇళ్లు (79.1 శాతం) పునాది స్థాయి దాటి ఉన్నాయి. జి.సిగడాం మండలంలో 1471 మందికి ఇళ్లు ఇవ్వగా 1104 మంది (75.1 శాతం) ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మందసలో 74 శాతం, కంచిలిలో 73.6 శాతం, నరసన్నపేటలో 72.8 శాతం, సరుబుజ్జిలిలో 72.5 శాతం ఇళ్లు పునాది, ఆ తర్వాత స్థాయి దాటి నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో 16 మండలాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది.
లేఅవుట్లలో నామమాత్రంగా విద్యుత్ కనెక్షన్లు
జగన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పనలోనూ వెనుకబాటు కనిపిస్తోంది. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 22,705 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిలో సొంత స్థలాల్లో ఇళ్లునిర్మించుకుంటున్న 19,548 మంది, జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు 3,157 మంది ఉన్నారు. వీటిలో ఇప్పటివరకు 17,657 ఇళ్లకు (77.77 శాతం) విద్యుత్ సరఫరాను అందించగలిగారు. ఇందులో సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున 16,576 ఇళ్లకు, లేఅవుట్లలో ఉన్న 1081 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. ఆమదాలవలస అర్బన్‌లో లేవుట్లలోని మూడు ఇళ్లకు మాత్రమే విద్యుత్ సరఫరా అందించగలిగారు. మందస, కవిటి ప్రాంతాల్లో చెరో ఐదు ఇళ్లకు, శ్రీకాకుళం అర్బన్‌లో ఆరు ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇచ్ఛాపురం అర్బన్, పలాస ప్రాంతాల్లో చెరో ఏడు ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించగలిగారు.
తాగునీటి సౌకర్యమూ అంతంతమాత్రమే
ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అంతంతమాత్రంగానే తాగునీటి సౌకర్యం అందించారు. జిల్లాలో 22,705 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా 17,396 ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో లేఅవుట్లలో కేవలం 1068 ఇళ్లకు మాత్రమే తాగునీటిని అందించగలిగారు. మిగిలిన 16,328 కనెక్షన్లు సొంతంగా ఇళ్ల నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇచ్చారు. ఆమదాలవలస అర్బన్‌లో జగనన్న లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్లలో ఒక్క ఇల్లుకే తాగునీటి కనెక్షన్ ఇచ్చారు. కవిటి, మందస మండలాల్లో చెరో ఐదు ఇళ్లకు మాత్రం తాగునీటి సరఫరా ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం అర్బన్‌లో ఆరిళ్లుకు, పలాసలో తొమ్మిది ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు.