May 09,2021 11:48

శేషగిరి మాస్టారు పీరియడ్‌ మధ్యలో వెళ్ళిపోయాడు. పాఠం పూర్తి చేయకుండానే వెళ్ళి పోయాడు. అవును.... బెల్‌ కొట్టక ముందే వెళ్ళిపోయాడు. చాలా చిన్న వయసులోనే మనకు ఎన్నో పాఠాలు నేర్పి వెళ్ళిపోయాడు. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతైనా చేయొచ్చని నిరూపించి వెళ్ళిపోయాడు. ఒక మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే అతని విలువ తెలుస్తుంది. అతను వెళ్ళి పోయినందుకు మనసు దిగులు పడుతూనే అతడు చేసిన శూన్యాన్ని ఎలా భర్తీ చేయాలో తెలియక భయం వేస్తుంది.
   శేషగిరి (యుటిఎఫ్‌) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌కు విజయనగరం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గురజాడ అధ్యయన కేంద్రానికి కేంద్రబిందువు. గత రెండు దశాబ్దాలుగా విద్యా రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సభలు సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తూ వచ్చాడు. స్టడీ సర్కిల్‌ తరఫున వర్తమాన సమస్యల మీద ఎన్నో చర్చా కార్యక్రమాలు నిర్వహించాడు. అలాంటి నిబద్ధతగల కార్యకర్త మొన్న అర్ధాంతరంగా కోవిడ్‌ తో మరణించాడు.
   పదవి కొందరికి అలంకారం. కొందరికి అది ఒక గురుతర బాధ్యత. ఆ బాధ్యత ఎరిగిన వాడు ముళ్లకిరీటంగా దాన్ని తలదాల్చుతాడు. అంపశయ్యగా భావించి దానిమీద సేద తీరుతాడు. ఉద్యమాల నేపథ్యంలో నుంచి వచ్చినవారికి, ఉపరితలాల నుంచి వచ్చి నాయకత్వం చేపట్టిన వారికి తేడా ఏమిటో శేషగిరిని చూస్తే తెలుస్తుంది. అతడు విద్యార్థి దశ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ కార్యకార్యకర్తగా ఎదిగి వచ్చినవాడు. ఉద్యమ వారసత్వాన్ని కుటుంబం నుంచి అందిపుచ్చుకున్నవాడు. ఐదు పదులు దాటకుండానే ఇంత చిన్న వయసులో ఎంతగానో ఎదిగాడు. ఒంటి చేత్తో ఎన్నో పనులు చేసాడు. ప్రజలతో ఎంతగానో మమేకమయ్యాడు.
   అతడు ప్రజల మనిషి అవుతున్నకొద్దీ వ్యక్తిగత జీవితంఅంటూ లేకుండా పోయింది. 'తన' అన్నది త్యజించాడు. తన కోసం తను ఆలోచించడం మానేశాడు. సమస్యకు పరిష్కారం కేరాఫ్‌ శేషగిరి అని బాధితులు భావించినప్పుడు తన సమయం తనకు కాకుండా పోయింది. మనం ఉద్యోగంలో చేరగానే భద్రమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. అక్కడనుంచి కూడికలు తీసివేతలతో సుఖ సంతోషాలకి ఏ మాత్రం డేమేజీ లేకుండా గడిపేస్తాం.
   కానీ శేషగిరి మనకు భిన్నమైన జీవితాన్ని ఎన్నుకున్నాడు. ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న వాడు. వారికి రక్షణగా నిరంతరం అరచేతులు అడ్డుపెట్టవలసిందే. సెంట్రీ గా కాపలా కాయాల్సిందే. ఇందులో వ్యక్తిగత సౌఖ్యానికి తావులేదు అని నిరూపించాడు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. ఏ రోజూ వేళకి తిన్నది లేదు, సమయానికి కంటికి కునుకూ లేదు. నిత్యం సమస్యల కొలిమిలో నడవడమే. ఎవరైనా ఫోన్‌ చేయడం ఆలస్యం ... అర్ధరాత్రి అయినా అపరరాత్రి అయినా తక్షణం అక్కడ ఉండేవాడు. అది ఒక బలహీనతగా మారిపోయింది అతనికి. సమస్యలు పావురాలై వచ్చి అతని భుజాల మీద వాలేవి.
ఒక్క ఉపాధ్యాయ సమస్యలేనా?
ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాశవికంగా చేపట్టిన ఏ విధమైన చర్యలకైనా పోరాటానికి దిగేవాడు. జనాన్ని సమాయత్తం చేసేవాడు. అలాంటి పోరాటాలు ఎవరు చేసినా దానికి కొండంత అండగా నిలబడే వాడు. ఒక కార్యక్రమం చేపడితే దాన్ని విజయవంతంగా ముగిసేవరకు అహౌరాత్రులు నిద్రాహారాలు ఉండేవి కావు. ఈ రోజుల్లో జనసమీకరణ ఎంత సమస్య? మరి ఎలా రప్పించేవాడో ... కిక్కిరిసిపోయి బయటే నిలిచిపోయే పరిస్థితి.
యుటిఎఫ్‌ బాధ్యుడిగా గాని గురజాడ అధ్యయన కేంద్ర నిర్వాహకుడిగా గాని అతను వేసిన అడుగులు అనుసరణీయమైనవి. ఆచరణీయమైనవి కూడా. ఈమధ్య స్టీల్‌ప్లాంట్‌, మహారాజా కళాశాల ప్రైవేటైజేషన్‌ విషయంలో నిరంతరాయంగా జరిగిన సభలు సమావేశాలు నిరసనలు మనం చూశాం.
వాటికి వెన్నుదన్నుగా నిలబడింది శేషగిరి. శేషగిరిలో మరో గొప్ప నాయకత్వ లక్షణం... అధ్యయనం.
ఈ రోజుల్లో సాహిత్యంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు సాహిత్య సంస్థల కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలుసు. కానీ శేషగిరి సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాల్ని సాకల్యంగా చదువుకున్నాడు. నిరంతరం చదువుతూ చర్చించేవాడు. కొంతమంది నాయకుల్లా అడ్డదిడ్డంగా వాదించకుండా సోదాహరణంగా వివరించేవాడు. సమస్య పూర్వాపరాలు తెలిసినవాడు కాబట్టే అధికారులు అతని అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. ఎంతటి వారినైనా నిలబెట్టి మరీ నిలదీసేవాడు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు రాజకీయ నాయకుల నిష్క్రియాపరత్వాన్ని, ఉదాసీనతనీ సహించేవాడు కాదు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని అనుభవిస్తూ వారి సమస్యలను పట్టించుకోకుండా, ఉదాసీనంగా ఉండడం మంచిది కాదని హెచ్చరించేవాడు.
శేషగిరి బుద్ధిబలానికి పునాది మార్క్సిజం. మార్క్సిజం సైద్ధాంతిక నేపథ్యంగానే అతని కార్యాచరణ సాగేది. అతని ఉపన్యాసం విన్న ఎవరికైనా ఈ విషయం రుజువు అవుతుంది. విషయ పరిధులు దాటని వక్తగా అతనికి మంచి పేరుంది. నిబద్ధత, ఆచరణ అతని రెండు కళ్ళు. అయితే శేషగిరి అర్ధాంతరంగా వెళుతూ మనకు చాలా బాధ్యతలు అప్పగించి పోయాడు. వాటిని మనం చేపట్టి పూర్తి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. మనం సమాజం కోసం ఎంతో పాటుపడినా, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరమని అతని జీవితం నేర్పిన పాఠం. ఏం చేయాలన్నా , సాధించాలన్నా ఆరోగ్యంగా ఉంటే కదా సాధ్యం.

- జి.ఎస్‌. చలం
94901 06390