May 14,2022 11:15

గుంటూరు : ' నా భర్త విదేశాల్లో ఉన్నారు.. అరెస్ట్‌ అంటూ.. తప్పుడు వార్తలు హేయం ' అని జెడ్పి చైర్‌ పర్సన్‌ హెని క్రిస్టినా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శనివారం హెనిక్రిస్టినా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ... తన భర్త విదేశాల్లో ఉన్నారని, అరెస్ట్‌ అంటూ.. తప్పుడు వార్తలు రాయడం హేయమన్నారు. తనను ఎందుకు ఇందులోకి లాగుతున్నారని ప్రశ్నించారు. మరొకసారి తన పేరు రాస్తే చట్టాన్ని ఆశ్రయిస్తానని... అసత్యాలు రాయటం హేయమని మండిపడ్డారు. 3 ఏళ్ల క్రితం కేంద్రం చాలా సంస్థలకు ఫండ్స్‌ నిలిపిందని గుర్తు చేశారు. నిధుల విషయంలో తాము ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలకు లోబడే ఉన్నామన్నారు. నిబంధనల ప్రకారమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎవరిని దెబ్బతీయటానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలు అన్ని నిరాధారమైనవని, సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనీ, తమ సంస్థ తెల్ల పేపరు వంటిది అని త్వరలోనే నిరూపించుకుంటామని హెనిక్రిస్టినా పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం తమ అత్త లలిత కుమారి హార్వెస్ట్‌ ఇండియా సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. అప్పటి నుండి ఎంతో మంది అభాగ్యులను ఆదుకున్నామన్నారు. పేదలు, వితంతువులు, వికలాంగులు, ఇతర అభాగ్యులు వేలాది మందికి సాయం చేశామన్నారు. అలాంటి సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఉన్నది ఉన్నట్టు రాయాలని హెనిక్రిస్టినా విజ్ఞప్తి చేశారు.