
- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - పొందూరు: అర్హతే ప్రామాణికంగా ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమైందన్నారు. అమరావతితో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తే చంద్రబాబునాయుడు అవహేళన చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేతకాకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి టిడిపి నాయకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అనంతరం మండలంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిడిఒ వై.విశ్వేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్‌కుమార్, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్, గాడు నాగరాజు, మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మి, వైస్ ఎంపిపి ప్రతినిధులు వండాన వెంకటరావు, కాకర్ల రాజారావు తదితరులు పాల్గొన్నారు.