May 11,2022 21:18

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ప్రజాశక్తి - తణుకు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పట్టణంలోని 3వ వార్డు జంగంచెర్వులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కారుమూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ఇచ్చిన వాగ్దానాల్లో ఇప్పటికే 90 శాతం వరకూ అమలు చేశారన్నారు. అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పథకాలు డబ్బులు జమచేయడంతో అధికారులు చుట్టూ తిరిగే పనిలేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, వైసిపి పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఎఎంసి మాజీ ఛైౖర్మన్‌ చిట్టూరి శ్రీవెంకటసుబ్బారావు పాల్గొన్నారు.
పోడూరు : తూర్పుపాలెంలో మాజీ మంత్రి, ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బుధవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో రంగనాథ రాజు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటిటా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోడూరు మండల జెడ్‌పిటిసిలు గుంటూరు పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిని, పెనుమంట్ర ఎంపిపి కర్రి వెంకట నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్‌:రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం పట్టణంలోని 30వ వార్డులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను, గృహ నిర్మాణాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న తోడు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలకు చెందిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాజకీయంగా మనుగడ సాగించడానికే ప్రజా వ్యతిరేక చర్యలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాలాస్వామి, తహశీల్దార్‌ అప్పారావు, గుండుమోగుల నాగు, కర్రి భాస్కరరావు, మానుకొండ వెంకటేశ్వరరావు, తెన్నేటి జగ్జీవన్‌, మాజీ కౌన్సిలర్‌ పాల్గొన్నారు.