May 29,2023 21:24

అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీష తోపాటు జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణలు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంత ప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్‌ లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో అర్జీ నాణ్యతగా పరిష్కరించడం, సరైన విధంగా అర్జీదారునికి ఎండార్స్మెంట్‌ చేసే విధానంలో సిబ్బందికి శిక్షణ నిర్వహించాలని శాఖాధికారులకు సూచించారు. హెచ్‌ఓడి లాగిన్‌లో ఆ శాఖకు సంబంధించి అప్లోడ్‌ చేసే అన్ని దరఖాస్తులు కనపడాలని ఒకవేళ అందులో ఏదైనా సమస్య ఉంటే కలెక్టరేట్‌ ఎఒను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని శాఖాధికారులు పారదర్శకంగా బదిలీలను చేపట్టాలన్నారు. ఏదేని శాఖలో ఎవరైనా బదిలీ కోరుకున్నప్పుడు నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో సిబ్బంది కొరత రాకుండా అదే క్యాడర్‌కు సంబంధించి సమర్థత కలిగిన వ్యక్తి ఈ జిల్లాకు బదిలీపై వస్తేనే బదిలీ కోరుకున్న వ్యక్తిని రిలీవ్‌ చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.