May 29,2023 21:41

బైకులపైనే దరఖాస్తులు రాస్తున్న అర్జీదారులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ''జగనన్నకు చెబుదాం'' కార్యక్రమములో వచ్చే అర్జీదారుల వినతులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ''జగనన్నకు చెబుదాం'' కార్యక్రమంలో జెసితో పాటు డిఆర్‌ఒ జె. వెంకటరావు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జగన్న కు చెబుదాం కార్యక్రమంలో 200 వినతులు రాగా వీటిలో అధిక శాతం భూ సమస్యలు, పెన్షన్‌ అర్జీలు అందాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కనీస వసతుల్లేక అవస్తలు
ప్రతి సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు తమ సమస్యలను విన్నవించుకొనేందుకు వస్తుంటారు. ప్రజా సమస్యలను తెలియజేసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు స్పందన ప్రాంగణంలో కనీస వసతులు లేవు. దరఖాస్తులు నింపుకునేందుకు బెంచీలు లేక పార్కింగ్‌ ప్రదేశంలోని వాహనాలపై దరఖాస్తులను రాసుకుంటున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక మహిళలు, వృద్ధులు మెట్లపై కూర్చొని సేద తీరుతున్నారు. వేసవిలో మండుటెండలో కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన ప్రజానీకానికి గొంతెండుతున్నా గుక్కెడు మంచినీళ్లు దొరికే అవకాశం కూడా లేదు. కొంతమంది తమ పిల్లల్ని తీసుకొని కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి క్యూ లైన్‌లో నిలబడిగా తమవెంట చిన్నారులకు కనీసం కూర్చోడానికి స్థలం లేక ప్రాంగణంలోనే నిలబడి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అధికారులు స్పందించి స్పందన కార్యాలయానికి వచ్చి ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.