Mar 25,2023 00:23

రోగులకు మందులు అందిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం-1 సచివాలయంలో అర్జీల పెండింగ్‌పై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డులకు సంబంధించిన అర్జీలో నిర్లక్ష్యంపై విఆర్‌ఒ నవుషద్ద్‌ అలీం, డిజిటల్‌ అసిస్టెంట్‌ స్వాతికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్‌ రికార్డులను పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన ఆర్జీలు 37 వరకు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. భూ రికార్డులకు సంబంధించి 22-ఎలో తమ భూమి నమోదైందని, దీన్ని సరిచేయాలని సంబంధిత భూ యాజమాని ఆర్జీ చేసుకున్నారు. దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడాన్ని కలెక్టర్‌ తప్పుపట్టారు. ఇందుకు బాధ్యులైన డిజిటల్‌ అసిస్టెంట్‌, విఆర్‌ఒకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని తహశీల్దార్‌ మధుసూదనరావును ఆదేశించారు. సచివాలయంలో ప్రతి అర్జీని నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని అల్లుకోల సచివాలయాన్ని పరిశీలించారు.
డయాలసిస్‌ కేంద్రాల్లో పడకల పెంపునకు కృషి
ఉద్దాన ప్రాంతంలోని డయాలసిస్‌ కేంద్రాల్లో అదనంగా పడకలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. పలాస ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కోరమాండల్‌ గ్రోమోర్‌, మురుగప్ప ఎరువులు, పురుగుల మందుల కంపెనీల సౌజన్యంతో కిడ్నీ డయాలసిస్‌ రోగుల కోసం రూ.11 లక్షల విలువైన మందులను కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావడాన్ని అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ భాస్కరరావు, వైద్యులు మేఘన, రఘురాం, వీరస్వామి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.