
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
కోవిడ్ కాలం అంతటా 'ఫ్రంట్ లైన్ వర్కర్లు'గా పేరు తెచ్చుకున్న పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానంటూ ఎన్నికల ముందు బీరాలు పలికారు. ఎన్నికలయ్యాక వారిని అవస్థలకు గురిచేయడం విధానంగా మారిపోయింది. జివిఎంసి యంత్రాంగం, ప్రభుత్వ ఆన్లైన్లో గల సాంకేతిక లోపాలతో వీరు ఇక్కట్లకు లోనవుతున్నారు. విశాఖ నగరంలో సుమారు 7500 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 12 నెలలుగా హెల్త్ అలవెన్సు ఒక్కొక్కరికీ రూ.80వేలకు పైబడి జివిఎంసి బకాయిలు పడింది. కరోనా కాలంలో ఇంట్లో నుంచి జనం బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పారిశుధ్య చర్యలను వీధులు, వార్డుల్లో మెరుగు పరిచే పనిలో వీరంతా నిమగమయ్యారు. కానీ వీరికి నెల నెలా జీతాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. జీతాలు రాకపోయినా, జడి వానలోనైనా పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేయాల్సిందే. ఎప్పుడో విడుదలయ్యే జీతాల కోసం ఇంటిల్లిపాది పస్తులతోనే అనేక దినాల పాటు ఉంటూ విధుల్లోకి వస్తున్న కుటుంబాలు నగరంలో అనేకం ఉన్నాయి. ఈ విషయాలేవీ అధికారులకు, వార్డుల శానిటరీ ఇన్స్పెక్టర్లకు పట్టడం లేదు. అత్యంత కర్కశంగా విధివిధానాలంటూ వీరిని బెదరగొడుతూ పనులు చేయించుకుంటూ వస్తున్నారు. దీంతో తమ గోడును అధికారులు పట్టించుకోవడం లేదంటూ లబోదిబోమని వీరు విలపిస్తున్నారు. బకాయిల విషయానికొస్తే... కనీసం ఒక్కొక్కరికీ 2 నెలల నుంచి నాలుగు నెలల వరకూ జివిఎంసి పరిధిలో ఈ జీతాల బకాయిలు ఉండి వీరిని వేధిస్తున్నాయి. అధికార యంత్రాంగానికి చిమకుట్టినట్టయినా లేదు. సుమారుగా 490 మందికి ఈ బకాయిలు ఉండిపోయాయి..
ఆప్కోస్ తప్పులు సరిదిద్దితేనా కష్టాలు తీరతాయి..
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కోస్)ను వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు వారి పేర్లను, వృత్తిని నమోదు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆన్లైన్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. విశాఖలో 490 మంది పేర్లలో తేడాలు, ఇంటి పేర్లు, ఇంకా అనేకానేక తప్పిదాలు ఈ నమోదులో చోటుచేసుకున్నాయి. దీంతో వీరెవరికీ స్థిరంగా జీతాలు రాని పరిస్థితి కొనసాగుతోంది. రూ.కోట్లలో బకాయిలు జివిఎంసి నుంచి కార్మికులకు రావాల్సి ఉంది. వీరికేగాకుండా విశాఖ నగరంలో సుమారు రూ.350 కోట్ల వరకూ వివిధ ప్రాజెక్టుల్లో చేపట్టిన పనులకు గానూ కాంట్రాక్టర్లకు బిల్లులు రాక వారు కూడా అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. పలు మార్లు వినతులు పట్టుకుని అధికారులు, మంత్రుల వద్దకు పారిశుధ్య కార్మిక సంఘం సిఐటియూ, కాంట్రాక్టర్ల అసోసియేషన్ వెళ్లడం మినహాయిస్తే పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వం ఆప్కోస్ తో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటే తప్ప పారిశుధ్య కార్మికులకు రెగ్యులర్గా జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నెల నెలా జీతాలు తీసుకునే అవకాశానికి ఇంకెన్నాళ్లు నిరీక్షించాలంటోనంటూ పారిశుధ్య కార్మికులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.