
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుండగా సమస్యలను పక్కన పెట్టిన ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతాలను సకాలంలో ఇవ్వడం లేదని సామర్లకోట రూరల్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఎం.రాజేశ్వరి, కాకినాడ అర్బన్ అంగన్‌వాడీ కృష్ణ కుమారి, పెద్దాపురం మండలం కట్టమూరుకి చెందిన కె.సత్యవతి, బోనం దేవి వరలక్ష్మి తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు పెండింగ్‌లో ఉంచడం వల్ల కుటుంబాలను పొషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని సెంటర్ల అద్దెలు, టిఎ, ఇతర బిల్లులు కోసం నెలలు తరబడి వేచి చూడాల్సి వస్తోందని తుని, ప్రత్తిపాడు, కిర్లంపూడి ప్రాజెక్టుల పరిధిలోని వర్కర్లు కడియపు దుర్గ, రావుల జ్యోతి, చంద్రకళ తదితరులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 5,546 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో సుమారు 5 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 4,818 మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల అనేకమంది పడుతున్న బాధలు వర్ణనాతీతం. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. ఇప్పుడు మే నెల పూర్తి కావస్తుంది. దీంతో కలుపుకుంటే మూడు నెలల వేతన బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి వేతన జీవులకు ప్రతి నెలా జీతాలు వేస్తేనే ఇంటిలో కిరాణా, పాల బిల్లు, కేబుల్, కరెంటు ఇలా అన్ని అవసరాలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ మూడు నెలల జీతాలు అందకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.5.75 కోట్లు, ఆయాలకు రూ.3.37 కోట్లు మొత్తంగా రూ.9.12 కోట్లు వేతనాల సొమ్ము అందాల్సి ఉంది. మూడు నెలలకు లెక్కిస్తే రూ.27.36 కోట్లు బకాయి ఉంది.
నిత్యం వేతనాలు పెండింగ్
రాజకీయ వేధింపులు ఆపాలని, కనీస వేతనాలను అమలు చేయాలని అంగన్‌వాడీలు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను కనీసం పట్టించుకోకపోగా నిత్యం రెండు నుంచి మూడు నెలలు వేతనాలను పెండింగ్‌లోనే ఉంచుతోంది. రెండేళ్లుగా ఏ నెలా సక్రమంగా వేతనాలు ఇచ్చిన పరిస్థితులు లేవు. నిరంతరం చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సంక్షేమం కోసం పని చేస్తూ కొద్దిపాటి వేతనాలతో సరిపెట్టుకుంటున్న వర్కర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం దారుణం. మరోవైపు సాంకేతిక కారణాలు చూపుతూ పలువురికి నాలుగు నుంచి ఐదు నెలలు వేతనాలు పడలేదు. కాకినాడ జిల్లాలో సుమారు 300 మంది వర్కర్లకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. తుని అర్బన్ ప్రాజెక్టులో పని చేస్తున్న మైలవరపు శ్రీదేవికి గతేడాది సెప్టెంబర్,అక్టోబర్, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల వేతనాలు ఇంకా జమ కాలేదు. పదేపదే అధికారులకు లిఖితపూర్వకంగా వేతనం గురించి విన్నవించినా సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ ఆమె కాళ్లు అరిగేలా తిరుగుతుంది. ఇలా అనేకమంది పెండింగ్ వేతనాల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు.