Jul 29,2021 22:41

లిమా : దేశ 200వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెరూ నూతన అధ్యక్షుడిగా పెడ్రో కేస్టిల్లో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల హర్షధ్వానాల మధ్య ఆయన తన బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణ ప్రాంత టీచర్‌, రైతు అయిన పెడ్రో ప్రారంభోపన్యాసం చేస్తూ, తనకు ఈ విజయాన్ని కట్టబెట్టిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. రాబోయే కాలంలో తమ ప్రభుత్వం తీసుకురాబోయే సంస్కరణలను వివరించారు. తన అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుడిగానే తన విధులను కొనసాగిస్తానని చెప్పారు. అందరికీ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వడం కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమమని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణ కల్పిస్తూ విధానాలు రూపొందిస్తామని ప్రకటించారు. సముచితమైన రీతిలో పెన్షన్లుల అందిస్తామన్నారు. ప్రభుత్వ రంగంలో నూతన సామాజిక రక్షణ వత్యవస్థను, ఐక్య ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు, వృద్ధులు, వికలాంగుల ప్రయోజనార్ధం జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థను రూపొందిస్తామన్నారు. లైంగిక బాధితుల మానసిక, శారీరక పునరావాసం ఏర్పాట్లు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా పోషకాహార లోపం సమస్యను అధిగమించే చర్యలు చేపడతామని ప్రకటించారు. దేశ పారిశ్రామీకకరణకు ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామన్నారు. రైతులకు అత్యంత అధునాతనమైన పరికరాలుల అందచేస్తామన్నారు. ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి చొరబడేందుకు వీలుగా సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు.