Mar 24,2023 23:25
బైటమంజులూరు ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులను పరీక్షిస్తున్న వైద్యురాలు

ప్రజాశక్తి-పంగులూరు: ఆరోగ్య ఉపకేంద్రం ద్వారా ప్రజలకు విస్తారమైన వైద్య సేవలు అందిస్తున్నామని, 14 రకాల వైద్య పరీక్షలు చేస్తూ, ప్రజలకు 67 రకాల మందులను పంపిణీ చేస్తున్నామని, మండలంలోని బయట మంజులూరు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఎం సురేఖ అన్నారు. బయట మంజులూరు ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం 'ప్రజాశక్తి' సందర్శించింది. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు, అక్కడ చేస్తున్న వైద్య పరీక్షలు, వైద్య సేవలు, రోగులకు ఇస్తున్న మందులు, జరుగుతున్న కార్యక్రమాలను గురించి 'ప్రజాశక్తి' ఆరా తీసింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ సురేఖ మాట్లాడుతూ, బీపీ, షుగరు, హిమోగ్లోబిన్‌ (హెచ్‌బి) పరీక్షతోపాటు, 14 రకాల పరీక్షలను రోగులకు చేస్తున్నామని, బీపీ, షుగర్‌ మొదలైన చిన్న చిన్న వాటితో కలుపుకొని మొత్తం రోగులకు, 67 రకాల మందులను ఇస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు ఓపి 20 వరకు వస్తుందని, రోజు రోజుకూ ఓపీ సంఖ్య కొంతమేర పెరుగుతోందని చెప్పారు. ఈ-సంజీవని ద్వారా, టెలి కాన్ఫరెన్స్‌లో డాక్టర్‌ ద్వారా ఫోన్‌ చేసి, పేషంట్లతో మాట్లాడిస్తున్నామని, పేషెంట్లకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తున్నామని అన్నారు. బయటమంజులూరు ఉపకేంద్రం పరిధిలో బయటమంజులూరుతో పాటు, భగవాన్‌రాజుపాలెం గ్రామం కూడా ఉందని, ఈ రెండు గ్రామాలు కలిపి గర్భిణులు 29 మంది, బాలింతలు ఐదుగురు, పిల్లలు (0-5) 192 మంది ప్రస్తుతం ఉన్నారని సురేఖ తెలిపారు. ప్రతి బుధవారం బయటమంజులూరు, శనివారం భగవాన్‌ రాజుపాలెం గ్రామాల్లోని పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తుంటామని చెప్పారు. 104 ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ ద్వారా మొదటి మంగళవారం బయట మంజులూరు, మూడో బుధవారం భగవాన్‌ రాజుపాలెం గ్రామాల్లో రోగులకు డాక్టర్‌ పరీక్షలు చేసి మందులు ఇస్తుంటారని తెలిపారు. స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రాం ద్వారా ఐరన్‌ టాబ్లెట్లను ప్రతి గురువారం స్కూల్లోని పిల్లలకు, అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు సోమ, గురువారాల్లో డ్రాప్స్‌ వేస్తామని తెలిపారు. ప్రతిరోజూ గ్రామాల్లో ఫీవర్‌ సర్వే జరుగుతుందని, గ్రామంలో జ్వరం ఉన్నవాళ్లను గుర్తించి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. టీబీ ఉన్న వారిని కూడా గుర్తించి వారికి మందులు ఇవ్వడంతో పాటు, మందులను మింగించే పనిలో కూడా ఆశ కార్యకర్తలు సహకరిస్తున్నారని చెప్పారు. ఇంకా అనేక రకాల సేవలు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) వి మాణిక్యం, ఆశాలు నల్లమద్ది సరిత, పుచ్చకాయల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.