Oct 02,2022 18:43

తైక్వాండో క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే ఎంఏ.హఫీజ్‌ఖాన్‌

  ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌: ఆరోగ్యం, ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌, తైక్వాండో సాధన అవసరమని కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ.హఫీజ్‌ఖాన్‌ సూచించారు. ఆదివారం కర్నూలు సిపిఐ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్‌గ్రెడేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోచ్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే 25 మంది విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ తైక్వాండోకు ఒలంపిక్స్‌లో ఆడే అవకాశం ఉన్నందున విద్యార్థులు అధిక సంఖ్యలో శిక్షణ పొంది రాష్ట్ర, దేశ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తేవాలని అన్నారు. కోచ్‌ షబ్జీర్‌ హుస్సేన్‌తో శిక్షణ పొందిన వారంతా ఒలంపిక్స్‌లో ఆడే అవకాశం సంపాదించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణకు పంపించే తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. బెల్టులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్పొరేటర్‌ కైపపద్మలతారెడ్డి మాట్లాడుతూ తైక్వాండో, కరాటే లాంటివి సాధన చేసి చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. చిన్ననాటి నుంచి సాధన చేస్తే ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ఉంటారని అన్నారు. తైక్వాండో శిక్షణ పొందేవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం మాట్లాడుతూ మార్షల్‌ఆర్ట్స్‌, తైక్వాండో లాంటివి సాధన చేసి జీవితాతం ఆయురారోగ్యాలతో ఉండాలని సూచించారు. అమ్మాయిలు, ఆబ్బాయిలు ఆకతాయిల నుంచి రక్షణ పొందడానికి, జీవితంలో ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి ధైర్యసాహసాలతో ఉండటానికి క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్టాడుతూ ప్రతి విద్యార్థికి క్రీడలు ఎందో అవసరమన్నారు. చదువుతోపాటు కరాటే, తైక్వాండో వంటివి సాధన చేస్తే అనేక ఉపయోగాలుంటాయని తెలిపారు. చదువులో, ఉద్యోగంలో, నిత్యజీవితంలో క్రీడలలో జిల్లా , రాష్ట్ర, జాతీయ స్థాయి సర్టిఫికెట్లు సహకరిస్తాయని అన్నారు. మాస్టర్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ సిపిఐ కార్యాలయ పరిసన ప్రాంతాల్లో ఉండేవారికి తైక్వాండో శిక్షణ ఇస్తామంటే అంగీకరించామని, మంచి క్రీడాకారులుగా ఎదిగి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. పానుగంటి చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి గణేష్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, తైక్వాండో మాస్టర్లు సల్మాన్‌బాష, ఖాజాహుస్సేన్‌, రోహిత్‌ పాల్గొన్నారు.

క్రీడాకారులు, నిర్వాహకులతో కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ.హఫీజ్‌ఖాన్‌, కార్పొరేటర్‌ కైపపద్మలతారెడ్డి, తదితరులు
క్రీడాకారులు, నిర్వాహకులతో కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ.హఫీజ్‌ఖాన్‌, కార్పొరేటర్‌ కైపపద్మలతారెడ్డి, తదితరులు