Sep 15,2021 00:21

మహాసభలో మాట్లాడుతున్న రమాదేవి, హాజరైన ప్రతినిధులు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, కంచరపాలెం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాటం చేయడం ద్వారానే మహిళా విముక్తి జరుగుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి ఉద్ఘాటించారు. నేడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా గ్రేటర్‌ విశాఖ నగర 7వ మహాసభ నగరంలోని కంచరపాలెం బొట్ట నరసింగరావు భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ మహాసభ ప్రారంభ సభలో రమాదేవి మాట్లాడుతూ సమాజంలో సగ భాగంగా మహిళలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై హింస పెరిగిందన్నారు. మహిళలు బయటకు రావడం వల్లే ఈ హింస పెరిగిందని, ఇంట్లోనే ఉండాలని మనువాదులు అనడం దారుణమన్నారు. ఏ సమాజమైనా పురుషులతో పాటు మహిళలకు కూడా అన్ని రంగాల్లో అవకాశాలు వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నేడు సమాజాన్ని చుట్టేసిన గంజాయి స్మగ్లింగ్‌, సెక్స్‌ వ్యాపారం, ప్రసార మాధ్యమాల్లో వికృత కార్యక్రమాలను ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధిస్తే సమాజానికి పట్టిన పీడ వదులుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి లేకపోవడం, ఒకవేళ వున్నా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని, దీంతో మహిళల బలహీనతలను ఆసరా చేసుకుని మానవ మృగాలు అత్యాచారాలు, వేధింపులకు ఒడిగడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ హయాంలో నగరాలు, పట్టణాల్లో మహిళలపై వివక్ష మరింతగా పెరిగిందని, పట్టణ మహిళల ఉపాధి మరింతగా దెబ్బతిందని వెల్లడించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బిప్రభావతి, నగర అధ్యక్షులు సత్యవతి, కార్యదర్శి ప్రియాంక ప్రసంగించారు. మహాసభకు మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ అధ్యక్షత వహించారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైనా పోరాడాలని మహాసభలో తీర్మానం చేశారు. ముందుగా ఐద్వా జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో మరణించిన నాయకులు సత్యవతి, రాజేశ్వరి, గోవిందమ్మ, రమణమ్మ చిత్ర పటాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు.