Jul 29,2021 23:20

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి కండే శ్రీనివాసులు

- కేసు వివరాలు వెల్లడించిన డిఎస్‌పి కండే శ్రీనివాసులు
ప్రజాశక్తి-కందుకూరు: 
కిడ్నాప్‌కు గురైన వ్యక్తిని కందుకూరు పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని కాపాడారు. స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డిఎస్‌పి కండే శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామానికి చెందిన బొంతు నిర్మల, వెంకటేశ్వర్లు వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. నిర్మలకు బొంతు వెంకటేశ్వర్లు రూ.1.10 లక్షల డబ్బు, 5 సవర్ల బంగారం ఇస్తానని మాట్లాడుకున్నారు. వీటిని ఇచ్చేందుకు విప్పగుంటకు చెందిన బండారు బాలకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. నిర్ణీత సమయానికి బొంతు వెంకటేశ్వర్లు డబ్బు, బంగారు ఇవ్వలేదు. దీంతో మధ్యవర్తిగా ఉన్న బాలకృష్ణను బొంతు నిర్మల, కొమ్మి వేణు, కొమ్మి పెద్ద వెంకటేశ్వర్లు (జరుగుమల్లి మండలం, ఎడ్లూరుపాడు), మన్నం బ్రహ్మయ్య, గోరంట్ల సీతయ్య (ఒంగోలు) గోరంట్ల పూర్ణచంద్రరావు (టంగుటూరు మండలం, మర్లపాడు)లు పట్టణంలో కలిసి నిర్మలకు బాగోలేదని చెప్పి కనుమళ్ల వద్ద పెట్రోలు బంకులో మోటారు సైకిల్‌ పెట్టించి కిడ్నాప్‌ చేశారు. బొంతు నిర్మల బాలకృష్ణ తల్లి పద్మకు ఫోన్‌ చేసి తనకు డబ్బులు, బంగారంతో పాటు మరో రూ.3 లక్షల చెక్కు రూపంలో ఇవ్వాలని, లేకుంటే కుమారుడిని చంపుతానని ఫోన్‌లో బెదిరించింది. దీంతో బండారు పద్మ ఈ నెల 27న కందుకూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డిఎస్‌పి కండేశ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ వి.శ్రీరామ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐలు కెకె.తిరుపతిరావు, కె.అంకమ్మ, ఉలవపాడు ఎస్‌ఐవిశ్వనాధరెడ్డి., పొన్నలూరు ఎస్‌ఐ రమేష్‌బాబు, వలేటివారిపాలెం ఎస్‌ఐ సుదర్శన్‌ ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీని గుర్తించి బాలకృష్ణను కాపాడినట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా చేధించిన ఎస్‌ఐ, సిఐలకు రివార్డులు ఇవ్వాలని ఎస్‌పి సిఫార్సు చేస్తున్నట్లు డిఎస్‌పి చెప్పారు. సమావేశంలో సిఐ వి.శ్రీరామ్‌, కందుకూరు పట్టణ ఎస్‌ఐ కెకె.తిరుపతిరావు, కందుకూరు రూరల్‌ ఎస్‌ఐ కె.అంకమ్మ పాల్గొన్నారు.