
నాసా : అరుణగ్రహంపై 'పర్సెవరెన్స్' రోవర్ దిగిన వీడియోను నాసా సోమవారం విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్' అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే రోవర్ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందకి దిగడం, అనంతరం శాస్త్రవేత్తలు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి. రోవర్ ఉపరితలంపై దిగే సమయంలో మైక్రోఫోన్ పనిచేయలేదు.. కానీ అంగారక గ్రహంపై దిగిన అనంతరం ఆడియోను రికార్డు చేయగలిగింది. ఈ పదిసెకన్ల ఆడియోలో మీరు వింటున్నది అంగారక గ్రహం ఉపరితలంపై మైక్రోఫోన్‌తో రికార్డై.. భూమిపైకి తిరిగి పంపబడినది అని శాస్త్రవేత్త డేవ్ గ్రుయెల్ తెలిపారు. కాగా, అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అనేది నిర్ధారించేందుకు అమెరికా 'పర్సెవరెన్స్' రోవర్‌ను గతేడాది జులై 30న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 19న రోవర్ అంగారకుడి ఉపరితలంపై విజయవంతంగా దిగింది. ఈ రోవర్లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్ ఆన్ చేశారు. కొన్ని రోజుల్లో రోవర్ ల్యాండింగ్ మరిన్ని ఫొటోలు, ఆడియోను విడుద చేస్తామని ప్రకటించింది.


