
చంఢీగఢ్ : రాష్ట్రంలో తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు ఆయుధ చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్లో, బహిరంగంగా ఆయుధాల ప్రదర్శనపై నిషేధం విధిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ప్రకటించారు. అలాగే హింసను లేదా ఆయుధాలను ప్రశంసిస్తూ సాగే పాటలు కూడా నిషేధించబడతాయని పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం.. ఇప్పటి వరకు జారీ చేసిన ఆయుధాల లైసెన్స్‌లను రాబోయే మూడునెలల్లో క్షుణ్ణంగా పున:పరిశీలించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆమోదం మేరకు కొత్త లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. ఆయుధాలను నిర్లక్ష్యంగా వినియోగించడం, వేడుకల్లో ఉపయోగించడం శిక్షార్హమైన నేరమని, ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు.