Jul 01,2022 15:49

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) :  విద్యా కానుక పథకం ప్రారంభం సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 5న ఆదోని రాక సందర్భంగా ఆదోని నెహ్రూ మెమోరియల్‌, మున్సిపల్‌ పాఠశాలలో ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. శుక్రవారం సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతం ఆదోనికి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పర్యటన విజయవంతమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ప్రోటోకాల్‌ ప్రకారం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని పాఠశాలల నుండి విద్యార్థులు వస్తున్నందున పిల్లలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పిల్లలకు స్నాక్స్‌, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో వేదిక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. పోలీస్‌ బందోబస్తు, పార్కింగ్‌, త్రాగు నీరు, విద్యుత్‌, పారిశుధ్యం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం తదితర ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ వెనుక బడిన పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదోనికి రావడం శుభ సూచకమన్నారు. జిల్లాల విభజన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఆదోని పర్యటనను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ రాం సుందర్‌ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ భార్గవ్‌ తేజ్‌ ఉన్నారు.