Aug 09,2022 15:54

న్యూఢిల్లీ  :  జాతీయ పార్టీ హోదాకు తమ పార్టీ  ఒక్క అడుగు దూరంలో ఉందని ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పార్టీ గుర్తింపుకు కృషి చేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో కూడా రాష్ట్ర పార్టీగా ఆప్‌ గుర్తింపు పొందిందని, ఈ మేరకు తమకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం వచ్చిందని కేజ్రీవాల్‌ చెప్పారు. ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడారు. మరో రాష్ట్రంలో కూడా ఆప్‌ గుర్తింపు పొందితే అధికారికంగా ఆప్‌ను జాతీయ పార్టీగా ప్రకటిస్తారని అన్నారు. గత ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సమీక్ష అనంతరం ఎన్నికల కమిషన్‌ నుంచి తమకు రాష్ట్ర పార్టీ హోదా లభించిందని కేజ్రీవాల్‌ అన్నారు. ఆప్‌ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది.

ఢిల్లీ, పంజాబ్‌ తర్వాత గోవాలో రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌ ఆర్టర్‌-1968 నిబంధనల కింద ఆప్‌ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు ఎన్నికల కమిషన్‌ ఒక లేఖలో పేర్కొందని అన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే జారీ అవుతుందని చెప్పారు. ఇసి లేఖను ట్విట్టర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 6.77 ఓటింగ్‌ శాతాన్ని సాధించింది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 గెలుచుకుని ఘన విజయం సాధించింది. మొత్తం ఓట్ల శాతంలో 42.01 శాతం ఓటింగ్‌ శాతం పొందింది.