Oct 17,2020 06:51

జమ్మూకాశ్మీర్‌లో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడం ముదావహం. పద్నాలుగు మాసాల నుంచి తీవ్ర నిర్బంధంలో బతుకులు వెళ్లదీస్తున్న కాశ్మీర్‌ లోయలో గురువారం ఏర్పాటైన పీపుల్స్‌ అలయన్స్‌ అక్కడి ప్రజానీకానికి ఒక కాంతిరేఖ. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసం గుప్‌కార్‌ భవన్‌ వేదికగా ఆరు ప్రధాన రాజకీయ పక్షాలు కలిసికట్టుగా 'పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌'గా చేతులు కలిపాయి. జమ్ము, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజలందరి ఆకాంక్షలకు వ్యతిరేకంగా...2019 ఆగస్టు 5న అప్రజాస్వామిక రీతిలో రద్దు చేసిన ఆర్టికల్‌ 35ఎ, 370 పునరుద్ధరించాలనేది ఈ డిక్లరేషన్‌ సారాంశం. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఒమర్‌ అబ్దుల్లా, ఫరూఖ్‌ అబ్దుల్లాతో పాటు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) నేత మెహబూబా ముఫ్తీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ (పి.సి) నుంచి సాజిద్‌ లోన్‌, అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎఎన్‌సి) నేత ముజఫర్‌ షా, సిపిఎం నాయకులు యూసుఫ్‌ తరిగామి, పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నేత జావిద్‌ మిర్‌ సంతకాలు చేసిన ఈ డిక్లరేషన్‌ పూర్తిగా న్యాయసమ్మతమైనది.
భారతదేశం తమను వేరు చేసి చూస్తోందంటూ ఇప్పటికే పరాయీకరణ భావన లోకి వెళ్లిపోయిన జమ్మూకాశ్మీర్‌ ప్రజలను శాంతింపజేసి వారిని చర్చల దిశగా అడుగులేయించడంలో పీపుల్స్‌ అలయన్స్‌ కూటమి వేయబోయే ప్రతి అడుగు కీలకం కానుంది. సరిహద్దులో నిత్య సంఘర్షణలతో ఇప్పటికే విలవిల్లాడిపోయిన కాశ్మీరీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతగా వేధింపులకు గురి చేసిందో ఈ పద్నాలుగు నెలలూ ప్రపంచమంతా చూస్తూనే వుంది. అత్యంత దుర్మార్గంగా జమ్మూకాశ్మీర్‌ను ముక్కలు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన నాటి నుంచి అక్కడ ప్రజలందరూ తీవ్ర నిర్బంధకాండలో భద్రతా బలగాల తుపాకుల నీడలో కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల నేతలందరూ గృహనిర్బంధంలో చేయని నేరానికి శిక్షను ఎదుర్కొన్నారు. రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన ఫరూఖ్‌ అబ్దుల్లా లాంటి పార్లమెంటేరియన్‌ను ఆయన వయసు కూడా చూడకుండా బంధించారు. మెహబూబా ముఫ్తీని, ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలందించిన యూసుఫ్‌ తరిగామిని అనారోగ్యస్థితి లోనే గృహనిర్బంధం చేసి బిజెపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది.
జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు యత్నించిన పార్లమెంటు సభ్యులకూ తొలుత అనుమతులు నిరాకరించి ఆ తర్వాత ఆంక్షలు విధించారు. సినీ ఫక్కీలో యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కొందరు మితవాద ఎంపీ లను జమ్ముకాశ్మీర్‌లో విహరింపజేసి కాశ్మీర్‌లో 'అంతా బాగుంది' అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంది. అదే యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఎంపీల్లో కొందరు ప్రగతిశీల ఎంపీలు ఈ దుర్మారాన్ని మీడియాకు బట్టబయలు చేసినా మోడీ సర్కార్‌కు కనువిప్పు కాలేదు. బూటకపు ప్రచారంతో కాశ్మీరేతర భారత ప్రజానీకాన్ని కేంద్రం నయవంచనకు గురి చేసింది. కాశ్మీర్‌ అనేది అప్పటి వరకూ వేరే దేశంగా ఉన్నట్లు, విడిపోయివున్న కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నామంటూ సంఘపరివార్‌ ప్రచారం చేసింది. ఏడాదిలో తుపాకుల మోత వినపడని నవ్య కాశ్మీర్‌ను చూస్తారంటూ నమ్మబలికారు. అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కానీ ఏమైంది. ఆ నినాదాల నాటి నుంచీ ఆహ్లాదకర లోయలో రక్తమోడని రోజు లేదు. ఇటు భద్రతా బలగాలు, అటు తీవ్రవాదుల మధ్య కాశ్మీరీ ప్రజానీకం మరింతగా నలిగిపోయింది. దేశమంతా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటే కాశ్మీర్‌ మాత్రం ముళ్ల పంజరంలో చిక్కుకుపోయిన శాంతి కపోతం మాదిరిగా కన్నీళ్లు పెట్టింది.
సహజంగానే స్వతంత్ర కాంక్ష మెండుగా ఉండే లోయలోని ప్రజానీకం మోడీ సర్కార్‌ వ్యవహరించిన శత్రుత్వ వైఖరితో భారత్‌ వేరు, తాము వేరనే పరాయీకరణ భావనకు గురైంది. ఇలాంటి నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పాటు కావడం కాశ్మీర్‌ అంశంతో ముడిపడిన భాగస్వామ్యులందరితో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం నిర్బంధ ప్రజానీకానికి గొప్ప ఊరడింపు. అయితే గుప్‌కార్‌ డిక్లరేషన్‌ను కుట్ర వ్యూహంగా అభివర్ణిస్తున్న సంఘపరివార్‌ నేతలు తమ దుర్మార్గాన్ని మరో మారు పునరుద్ఘాటించారు. పీపుల్స్‌ అలయన్స్‌కు యావత్‌ భారతావనిలోని ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు అండగా నిలిచి కాశ్మీర్‌ లోయలో పరాయీకరణ భావాన్ని పోగొట్టాలి. అహ్లాద కాశ్మీర్‌లో వేర్పాటువాదం బలపడకుండా, ఈ దేశం ముక్కలు కాకుండా కాపాడుకోవాలి. 'మేం భారతీయులం' అని సగర్వంగా, నమ్మకంగా కాశ్మీరీయులంతా చెప్పుకునే రోజు రావాలి.