May 17,2022 21:30

- వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి యూనియన్‌ వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 
ఆశావర్కర్లకు నెలకు రూ.15 వేలు గౌరవవేతనం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్రను ఎపి ఆశావర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు యూనియన్‌ నాయకులు ఆయన్ను సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. కమ్యూనిటీ హెల్త్‌ ఆశావర్కర్లను ఆశాలుగా పరిగణించాలని, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. సెలవులు, మెటర్నిటీ, మెడికల్‌ సెలవులు, పర్మినెంటు చేయడం, ఎఎన్‌ఎం పోస్టుల భర్తీలో ఆశావర్కర్లకు వెయిటేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆశాలకు రూ.10 లక్షలు గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, కోవిడ్‌ కాలంలో మరణించిన ఆశాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆశాలతో అనవసరమైన పనులు చేయించవద్దని, వారిపై పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై గతంలో ప్రభుత్వం చర్చలు జరిపి, పరిష్కరించలేదని తెలిపారు. ఆశాలు పనిభారంపై ఆందోళన చేస్తే నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని, వారికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయాలకు ఎఎన్‌ఎంల కేటాయింపులు ఎన్‌హెచ్‌ఎం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) నిబంధనలకు భిన్నంగా చేశారని వివరించారు. వెయ్యి నుంచి 1,200 జనాభాకు ఒక ఆశాను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేల వేతనం నెలలో ఒకేసారి ఇవ్వాలని, నాణ్యమైన సెల్‌ఫోన్లు, 4జి సిమ్‌కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, కోశాధికారి కమల పాల్గొన్నారు.