Apr 30,2022 08:05

స్వతంత్ర పాత్రికేయానికి వేగుచుక్కగా నిలిచిన ఃవికిలీక్స్‌ః అధినేత జూలియన్‌ అసాంజే పట్ల బ్రిటన్‌, అమెరికా అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గం. ప్రభుత్వ రహస్య పత్రాలను బహిర్గతం చేసిన నేరానికి గాను అసాంజేను అమెరికాకు అప్పగించడం న్యాయ సమ్మతమేనంటూ, ఈ విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని లండన్‌ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. విడుదల కోసం అసాంజే పెట్టుకున్న అప్పీలును ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. యుద్ధా నేరాలను ఃవికిలీక్స్‌ః ద్వారా వెలుగు లోకి తెచ్చిన పాత్రికేయుడి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. పత్రికా స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి ఇతర దేశాలకు నీతులు చెప్పే ఈ రెండు అగ్రరాజ్యాలు ఇరాక్‌లో దారుణ మారణకాండకు పాల్పడ్డాయి. మానవాళి పట్ల ఇవి సాగించిన అలాంటి నేరాలను బయటపెట్టినందుకు అసాంజేను వెంటాడి వేధిస్తున్నాయి.
యుద్ధ నేరాలకు ఏ దేశం పాల్పడినా ఖండించాల్సిందే. యుద్ధంపై రష్యా తన సొంత ప్రజలకు అబద్ధాలు చెబుతోందంటూ కథనాలు వండి వారుస్తున్న పాశ్చాత్య మీడియా అమెరికా, బ్రిటన్‌, నాటో దేశాల యుద్ధోన్మాదంపై ఏనాడూ నోరు మెదిపింది లేదు. రష్యాలో పాత్రికేయురాలు ఒవ్సియాన్నికోవాను యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేపట్టినందుకు అరెస్టు చేశారనీ, జైలు శిక్ష కూడా పడవచ్చునని పశ్చిమ దేశాలు నానా యాగీ చేశాయి. బ్రిటన్‌ రాజకీయ నాయకులూ వత్తాసు పలికారు. అసాంజే కూడా యుద్ధాన్నే వ్యతిరేకించారు. ఇందుకు ఆయనను అభినందించడానికి బదులు వేధింపులకు గురిచేయడం పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. వాస్తవానికి అసాంజే అమెరికా పౌరుడేమీ కాదు. అమెరికా సైన్యంలో ఆయన ఒక ఉద్యోగి మాత్రమే. ఆయనపై మోపిన నేరాభియోగాలు.. ప్రభుత్వ రహస్య పత్రాలను కలిగియున్నాడని కాదు.. ఆ రహస్య పత్రాలను ఃవికిలీక్స్‌ఃలో ప్రచురించినందుకు ఆయనపై అభియోగాలు మోపారు. ప్రచురించడం నేరమట? ప్రచురణను అడ్డుకోవడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఇప్పుడు అసాంజేని అప్పగిస్తే 175 ఏళ్ల పాటు జైలులో బంధించేందుకు అవసరమైన అభియోగాలతో అమెరికా గోతికాడ నక్కలా కాచుక్కూర్చుంది. అసాంజే బాటలో యుద్ధనేరాలను వెలుగులోకి తీసుకొచ్చిన మరో ప్రజావేగు స్నోడెన్‌ కూడా ఎనలేని అణిచివేతకు, వేధింపులకు గురయ్యాడు. అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకునే అమెరికా అత్యంత నియంతృత్వంతో హక్కుల హనానికి పాల్పడని రోజు అంటూ లేదు. నల్లజాతీయుల పట్ల జాత్యహంకారంతో అనునిత్యం చోటుచేసుకుంటున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ఇస్లామోఫోబియాను రగిలించి ఃశ్వేత వర్ణః ఆధిపత్యాన్ని రెచ్చగొట్టి నల్ల జాతీయులతో పాటు అరబిక్‌, ఆసియా దేశాలకు చెందినవారిపై ఎంతటి అణిచివేతకు పాల్పడిందో చూశాం. ఃస్వేచ్ఛా ప్రతిమః సాక్షిగా స్వేచ్ఛకు ఉరి తాళ్లు పేనుతున్న నైజం అమెరికాది.
పాత్రికేయ విలువల ప్రామాణికతకు ఃపరిశోధనాత్మక పాత్రికేయంః అనేది ఒక కొలమానం. అది నేరం కాదు. అమెరికా లోని ఏ మీడియా సంస్థ కూడా చేయని సాహసాన్ని అసాంజే చేశారు. అమెరికా యుద్ధోన్మాద ముఖంపైనున్న మేలిమి ముసుగును తొలగించిపారేశారు. అమెరికాకు అప్పగించే విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తీర్పు వెలువరించినందున ఆయనను ఏక్షణమైనా అమెరికాకు అప్పగించవచ్చు. అమెరికాకు, అసాంజేకు జరుగుతున్న పోరాటం యుద్ధ ప్రభువులకు, హక్కుల పరిరక్షణకు మధ్య జరిగే పోరాటం. పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులు పరిరక్షించబడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అసాంజేకు బాసటగా నిలవాలి. మానవ హక్కులు, స్వేచ్ఛా, సమానత్వాలు ఎక్కడ నిరాకరణకు గురైనా అక్కడ ప్రజాతంత్రవాదులంతా గళమెత్తాలి. స్వేచ్ఛను పరిరక్షించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా అసాంజే విడుదల కోసం, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటాలు ఫలించాలని ఆశిద్దాం.
000