Nov 25,2021 10:50

అమరావతి : ఆరో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మరో రెండు రోజులు ఈనెల 30 వరకు పొడిగించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారీటీ సంక్షేమంపై చర్చ జరగనుంది. ఆరోగ్యం, విద్య, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరో మూడు బిల్లులను, ప్రభ్వుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు...
రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ... ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందని తెలిపారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ... పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు సేకరించిన భూమి, ఇళ్లులేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాల సంఖ్య చూస్తే ఈ రెండున్నర ఏళ్లలో ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అని అన్నారు. 71 వేల ఎకరాలకుపైగా భూమిని వైసిపి ప్రభుత్వం సేకరించిందని గుర్తు చేశారు. ప్రజల వద్ద సేకరించిన భూమికి వెంటనే డబ్బులు అందించామన్నారు. అయినా రాజకీయ ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరలో పేదలకు ఇళ్లపట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో 14 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆళ్ల నాని అన్నారు.