Mar 02,2021 08:11

రాష్ట్రంలో ఏడాది కిందటే జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలు అనేక అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఈ నెల 10న జరుగుతున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు వారి వారి ఎజెండాలకు అనుగుణంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పట్టణ ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా వ్యాప్తి అనంతరం, మళ్లీ వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ భయాలు అలముకుంటున్న వేళ జరుగుతున్న ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కరోనా సంక్షోభ నివారణ కోసమంటూ కేంద్రంలోని బిజెపి సర్కారు ముందుకు తెచ్చిన ఆత్మనిర్భర్‌ సంస్కరణలు పట్టణ ప్రజానీకంపై ఎడాపెడా ప్రత్యక్ష, పరోక్ష భారాలకు సిద్ధం చేసిన తరుణమిది. రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కేంద్ర కుసంస్కరణలకు తలూపుతూ తామే ఒకరికొకరు ప్రత్యామ్నాయమంటూ ఎన్నికల్లో తలపడుతున్న పరిస్థితి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం, వైద్యం, విద్య, కుటుంబ సంక్షేమం వంటి రంగాలలో మెరుగైన పాత్ర పోషించడం చేయాలి. అందుకు ఎదురయ్యే సవాళ్లు, ముఖ్యాంశాలపై ఎన్నికల్లో చర్చనీయాంశాలు కావాలి. కాని పట్టణ పేదల జీవితాలకు, వారి దైనందిన సమస్యలకు కించిత్తు సంబంధం లేని అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. పట్టణ ప్రజల ఉనికికే ప్రమాదం తలపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 'సంస్కరణ' విధానాల పర్యవసానాలు ఏవిధంగా ఉంటున్నాయన్న అంశంపై చర్చ ఎక్కడా ముందుకు రావడంలేదు. ప్రజల చెంతకు ప్రత్యామ్నాయాలను వెళ్లనీకుండా కుట్ర జరుగుతోంది. విధులు, అధికారాలు కలిగి ఉండే పురపాలక సంస్థలు నేడు అవసరం. కాని ప్రధాన పార్టీలు ఆ విషయానికి ఏ మాత్రమూ ప్రాధాన్యత ఇవ్వడంలేదు.


దేశంలో కొన్ని ముఖ్య రాష్ట్రాలతో పోల్చినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అర్బన్‌ ఏరియా తక్కువే అయినప్పటికీ పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. అర్బన్‌ జనాభా 35 శాతానికి చేరింది. అర్బనైజేషన్‌ వేగానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు పెరగట్లేదు. కరోనా లాక్‌డౌన్‌ పట్టణాల్లో జీవిస్తున్న పేదల బాధలను ఎత్తి చూపింది. అర్బన్‌లో ధనికులు, పేదల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు అధికారాలను, విధులను, ఆర్థిక వనరులను వికేంద్రీకరించాలని చెబుతున్నాయి. సవరణలు చేసి మూడున్నర దశాబ్దాలైంది. ఆచరణలో అందుకు భిన్నంగా జరిగింది. మున్సిపాలిటీలకు ఉన్న వృత్తి, వినోద పన్నులు, స్టాంపు డ్యూటీలో వాటా తదితర వనరులను రాష్ట్రం చేజిక్కించుకుంది. అత్యధిక మున్సిపాలిటీలు సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితిలో లేవు. మరోవైపు ప్రైవేటీకరణ, కాంట్రాక్టీరణ, యూజర్‌ ఛార్జీలు, పన్నుల పెంపు చేపట్టాలన్న ఒత్తిడి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వస్తోంది.


ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దన్నది నయా-ఉదారవాద విధానాల ఎజెండా. ఆ విధానాలను తలకెత్తుకున్న కేంద్రం, రాష్ట్రాలపై ఆంక్షలు పెడుతోంది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను ఆ కోవలోనిదే. అందరికంటే ముందు మన రాష్ట్రం దాన్ని అమలు చేస్తోంది. గతంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, ఇప్పుడు స్మార్ట్‌, అమృత్‌ సిటీల లక్ష్యం తాగునీరు, పారిశుధ్యం, సీవరేజి వంటి పౌర సేవల కల్పన బాధ్యత నుంచి ప్రభుత్వాలను, స్థానిక సంస్థలను తప్పించడమే. ఆయా సేవలను ప్రైవేటు, కార్పొరేట్లకు అప్పగించడమే. ఏ సేవనైనా పౌరులు పూర్తి డబ్బు చెల్లించి కొనుక్కోవాలి. నీటికి మీటర్లు, పబ్లిక్‌ కుళాయిల రద్దు, చెత్త పన్ను, భూముల అమ్మకం అమాంబాపతు అందులో భాగమే. 15వ ఆర్థిక సంఘం సైతం ఆ విధమైన సిఫారసులే చేసింది. స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటే ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి మహమ్మారులు ముంచుకొచ్చినప్పుడు శక్తివంతంగా ఎదుర్కోవచ్చన్నది కేరళ అనుభవం. దాని నుంచి కేంద్రం, రాష్ట్రం నేర్చుకోవాలి. ఏ దేశ అభివృద్ధికైనా పట్టణాభివృద్ధి ప్రధాన కొలమానం. ఏనాడో తెలుగు సినీ కవి చెప్పినట్టు 'టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ...' అనేంతగా పట్టణాలు భయంకరంగా తయారైతే అభివృద్ధి అనేదానికి అర్ధం మారిపోతుంది. స్థానిక సంస్థల ఉనికికి పౌర జీవనానికి పాలకుల విధానాల రూపంలో పొంచి ఉన్న ప్రమాదాలపై ఎన్నికల సందర్భంలోనైనా ప్రజలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.