Oct 17,2020 06:44

అసమ్మతి, భిన్నాభిప్రాయం, అనంగీకారం వంటివి కొత్త భావనల ఆవిర్భావానికి... నాగరికతల నిర్మాణానికి...
ఏ విధంగా దోహదపడతాయి?

దీన్నొక ఉదాహరణతో వివరిస్తాను. శ్రమణులు (బౌద్ధులు, జైనులు, అజ్వికులు...వంటి వివిధ తెగల వారు) వైదిక బ్రాహ్మణవాదంతో విభేదించారు. బ్రాహ్మణులు చెబుతున్న కొన్ని సిద్ధాంతాలను ప్రశ్నించడంతో ప్రధానమైన అసమ్మతి మొదలైంది. ఉదాహరణకు...దేవుని పట్ల విశ్వాసాన్ని, వేదాలు దైవం నోటి నుండి వెల్లడైనవనడాన్ని, బలులు ఇవ్వడంలోని ఆంతర్యాన్ని వారు ప్రశ్నించారు. ఆ రకంగా, విశ్వసించేవారు, విశ్వసించనివారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దాంతో, శ్రమణులను నాస్తికులుగా (విశ్వాసం లేనివారిగా) పేర్కొనసాగారు బ్రాహ్మణులు. విశ్వాసానికి సంబంధించి ఈ రెండు సిద్ధాంతాలు సమాంతరంగా నడుస్తున్నాయని నా పుస్తకంలో చూపించే ప్రయత్నం చేశాను.
శ్రమణులు సర్వసంగ పరిత్యాగులు. వీరు ఆరామాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది సమాజానికి కొత్త. ఇతర మతాలు కూడా ఇలా మతాన్ని పెంపొందించగల, సామాజిక పాత్ర పోషించగల సంస్థలను స్థాపించాలన్న ఆలోచనతో స్ఫూర్తి చెందాయి. విహారాలు, ఆలయాలు, ఆశ్రమాలు, ఖంకాలు, గురుద్వారాల చరిత్ర ద్వారా...అలాగే పరస్పర పోషణ ద్వారా...మతాలు సమాజాలను ఎలా నియంత్రిస్తున్నాయనేది చాలా స్పష్టంగా గోచరమైంది. ఇవి ఆరాధనా స్థలాలు, సామాజిక నియంత్రణను అమలు చేసే సంస్థలుగా వున్నాయి.
16వ శతాబ్దానికి చెందిన ఒక సంస్కృత గ్రంథం శ్రమణులు, తురుష్కులను నాస్తిక కేటగిరీ లోకి చేర్చింది. వారిని మ్లేచ్ఛులుగా ముద్ర వేసింది. సమాజంలో అప్పటికే బాగా గుర్తింపు పొందినవారు, ఇతరులకు ఇచ్చిన ఈ గుర్తింపుతో అంగీకరించని వారిని ఇక్కడ మనం అసమ్మతికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంతో కొత్త కొత్త ప్రశ్నలు ఆవిర్భవించాయి. కొత్త సంస్థలను స్థాపించారు. కొత్త తరహా పోషణ పద్ధతులు ఆవిర్భవించాయి. అసమ్మతి వ్యక్తం చేసే గ్రూపులు సనాతనవాదులుగా మారేలా సామాజిక క్రమం ప్రోత్సహిస్తూ వచ్చింది. మతం అనేది కేవలం పుస్తకాలకు పరిమితమైనదిగా వుండిపోలేదు. ఇది సమాజానికి కూడా రూపం ఇవ్వడం ఆరంభించింది. సమాజం వల్ల మతం కూడా ఒక రూపును సంతరించుకోవడం ప్రారంభమైంది. ఇక్కడ మళ్ళీ అసమ్మతి తలెత్తింది.
ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ప్రశ్నించకుండా విజ్ఞాన సముపార్జనలో పురోగతి వుంటుందా?
లేదు. ప్రశ్నలు అడగడాన్నే మనం అనుమతించక పోవడం సమాజాన్ని అస్థిరపరిచేందుకు, సంస్థలను నాశనం చేసేందుకు ఒక మార్గం.
అసమ్మతి అనేది నాగరికత లోని అతి ముఖ్యమైన భాగం. నాగరికతల చరిత్రలు చూస్తే ఇది మనకు స్పష్టమవుతుంది. తాత్విక ఆలోచనల్లో, నూతన దృగ్గోచర రూపాల్లో, నూతన సాహిత్యంలో ఇదొక అత్యున్నత అంశంగా పేర్కొన్నారు. ఈ క్రమం గతం నుండి మనం నేర్చుకున్నదాన్ని, మనకు తెలిసిన దాన్ని ప్రశ్నించడాన్ని నేర్పుతుంది. సృజనాత్మకమైన పరిష్కారాలను అందిస్తుంది.
నాగరికతలనేవి ఒంటరిగానే అభివృద్ధి చెందుతాయన్నది గతంలో ఆలోచన. కానీ ఇప్పుడు, దానికి విరుద్ధంగా సంస్కృతులనేవి చైతన్యశీల స్వభావాన్ని కలిగివుంటాయని మనకు తెలుస్తోంది. జ్ఞానం పతాక స్థాయికి చేరాలంటే నాగరికతల మధ్య విస్తృతమైన కార్యాచరణ అవసరం. ఉదాహరణకు, మొదటి సహస్రాబ్ది శకం చివరిలో, యురేసియా వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞుల మధ్య అద్భుతమైన విజ్ఞాన మార్పిడి ప్రారంభమైంది. ఇది, మరింత మెరుగైన వివరణలతో కొత్త ప్రశ్నలను ప్రోత్సహించింది. చాలా తరచుగా సామాజిక మార్పును ప్రవేశ పెట్టే కొత్త సాంకేతికతలకు దారి తీసేది. ఉదాహరణకు, ప్రశ్నించిన ఫలితంగానే ఆస్ట్రోల్యాబ్‌ను ఆవిష్కరించారు. దీనివల్ల సముద్ర జలాల్లో రాకపోకలు సులభతరం అయ్యాయి. ఫలితంగా యురేసియాలో వాణిజ్యాన్ని ప్రభావితం చేసింది.
షహీన్‌బాగ్‌ మహిళల మాదిరిగా అహింసాత్మకమైన అసమ్మతి వాణి మరింత బాగా వినిపిస్తుందా? ఇది మీకు గాంధీని ఎందుకు గుర్తు చేస్తుంది?
ఎటువంటి హింస లేకపోతే అసమ్మతి అనేది ఎప్పుడూ శక్తివంతమైనదే. అసమ్మతిని నివారించేందుకు హింసతో దాన్ని తోసిపుచ్చుతారు. మూలం ఏదైనప్పటికీ హింస వల్ల భయానికి బీజం పడుతుంది. అది నియంత్రించలేని విపత్తు స్థాయికి పెచ్చరిల్లుతుంది. అసమ్మతివాదులు సాధారణంగా హింసకు పాల్పడ్డం కంటే నైతిక స్థైర్యంతో వుంటారు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేటపుడు వారు నైతిక స్థైర్యాన్ని కోల్పోతే, అసమ్మతి నోరు మూయించేందుకు గానూ వారు హింసకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చు. ఎమర్జన్సీ సమయంలో మనం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇది మళ్ళీ ఉత్పన్నమవుతుందా లేదా అని చాలా మంది అడిగారు.
భీమా-కోరెగావ్‌ సమావేశానికి సంబంధించి అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపించిన 11 మంది కార్యకర్తల్లో 9 మందిని రెండేళ్ళ క్రితమే జైల్లో పెట్టారు. మరికొంతమంది ఇప్పుడు వారితో కలిశారు. అక్కడ విచారణే లేదు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ లేదు. ఆ అల్లర్లు జరిగినపుడు వారు అసలు ఆ ప్రాంతంలోనే లేరు. ఎలాంటి బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎక్కడ అవసరమో అక్కడ సామాజిక న్యాయానికి మద్దతుగా సుదూరం నుండి వారు పని చేశారు. కానీ, ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారిని కాల్చి చంపాలంటూ తమ ప్రేక్షకులను కోరేలా బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేవారిని మాత్రం ఈ అధికార పరిరక్షకులు ఏమీ చేయలేకపోయారు. వివక్షత అధికారం పట్ల భయాన్ని పెంచుతుంది.
ఈనాడు గాంధీ గురించి, ఆయన కాలం గురించి ఎందుకు గుర్తు చేసుకున్నారని మీరు నన్ను అడిగారు. అధికారం పట్ల భయం మునుపటి సందర్భాలను రేకెత్తిస్తుంది. గాంధీ, ఇతర నేతలు బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజలకు గల భయాలను పోగొట్టారు. సత్యాగ్రహం రూపంలో తమ ఉనికిని చాటేందుకు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వారు అందచేశారు. వలస వ్యతిరేక జాతీయవాదులు పెట్టిన బహిరంగ సమావేశాలకు మనం హాజరయ్యాం. ఆ సమావేశాల్లో ప్రతిధ్వనించిన నినాదాలు-ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, లే కే రహేంగే అజాదీ-ఇంకా మన చెవుల్లో మోగుతున్నాయి. అసమ్మతికి దృశ్యనీయత వుండాలి. కానీ అహింసాత్మకంగా వుండాలి. షహీన్‌బాగ్‌ అసమ్మతి మనకు కనిపించింది. అహింసాత్మకంగానూ వుంది.
వలసవాదం మతాన్ని ఏ రకంగా ప్రభావితం చేసింది?
హిందూమతం, ఇస్లామ్‌ల వలసవాద సూత్రీకరణలు ఆధునిక కాలానికి పూర్వ కాలంతో విభేదిస్తాయి. ముస్లింలు, క్రైస్తవులు మినహా మిగిలినవారందరినీ హిందువులుగానే లెక్కగట్టారు. హిందూమతం చరిత్ర అంతా సామరస్యమైన తీరులో ఒకే రీతి గల ఒకే మతంగా నిర్మించబడింది. విశ్వాసాల్లో, నిబద్ధతలో సుసంపన్నమైన వైవిధ్యతను వ్యక్తీకరించడం, కులాలు, తెగల మధ్య సంబంధాలను కలుపుకోవడం వంటి అంశాలపై అస్సలు దృష్టి పెట్టకుండానే భారతదేశంలో మతమనేది చాలా భిన్నమైన రీతిలో ఉద్భవించిందని చెప్పవచ్చు. భారతదేశ సంస్కృతుల్లో విభిన్నమైన విశ్వాస వ్యవస్థలు వున్నాయి. అవన్నీ వైవిధ్యతకు అనుగుణంగా వున్నాయి. ఇప్పుడు, మతాన్ని రాజకీయ ఎజెండాకు అనుగుణంగా వుండేలా తీర్చిదిద్దే సిద్ధాంతంగా, హిందూ రాష్ట్రాన్ని చట్టబద్ధం చేయడానికి హిందూ మతాన్ని హిందూత్వ సిద్ధాంతంగా మార్చే ప్రయత్నంతో ఈ వలసవాద పునర్నిర్మాణం మరింత లోతైన మూలాలకు చేరుతోంది.
అనిశ్చిత పరిస్థితులను మీరెలా అధిగమించారు?
పటిష్టమైన నైతికతలతో, మానవాళి (మనలో ప్రతి ఒక్కరూ) మరింత మెరుగ్గా జీవించగల పరిస్థితులతో కూడిన సమాజంలో మనం జీవించే సమయం వుంటుందని బలంగా నమ్ముతూ వచ్చాను. గత అర్ధ శతాబ్దం నుండి లేదా ఇటీవలి కొన్ని సంవత్సరాల క్రితం వరకు జరిగిన చర్చల్లో ఇది గుర్తుకు వస్తూనే వుండేది. ఈ అంశాలపై చర్చలకు ప్రాధాన్యత ఎప్పుడూ వుంది. మనం ఈనాడు భిన్నమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. హింస అనేది ఇప్పుడు మన మునివేళ్ళపై వుంది. న్యాయమనే భావనలు మన వీలును బట్టి అనుకూలమైన రీతుల్లో వుంటున్నాయి. అవినీతి కోరలు న్యాయ వ్యవస్థను కూడా పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి అనిశ్చితి సమయాల్లో, భవిష్యత్‌ పట్ల నా విశ్వాసాన్ని సమర్ధించుకోవడానికి గతకాలపు దృక్పథాన్ని అనుసరిస్తాను. విద్వేషం స్థానే ప్రేమ వుండాలని భావించే, వాదించే నేతలు మనకు వున్నారు. అటువంటి దయ, కరుణ భావనలు...మనకు గల అన్ని సామాజిక వ్యవహార శైలిల్లోని హింసను అనుమతించరాదు. ఈనాడు, ఇవన్నీ అసమ్మతి స్వరాలుగా మారిపోయాయి. భవిష్యత్‌ ఎలా వున్నా, ఈ గొంతులు వినిపిస్తూనే వుండాలి.