Nov 25,2021 07:23
  • ఇ-శ్రమ్‌ పోర్టల్‌తో చేతులు దులిపేసుకున్న కేంద్రం
  • రాష్ట్రమూ పట్టించుకోకపోవడంతో నమోదు అంతంతమాత్రమే
  • రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14.11 లక్షలు మందికే గుర్తింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో అసంఘటిత రంగ కార్మికులను గుర్తించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. కష్టజీవుల నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌లో ప్రారంభించి చేతులు దులిపేసుకుంది. 2021 నవంబర్‌ 22 నాటికి రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల్లో కేవలం 14,11,703 మందినే నమోదు చేయించారు. ఈ నమోదు ప్రక్రియ డిసెంబర్‌ 31తో పూర్తికావాల్సి వుంది.
    వాస్తవానికి https://register.eshram.gov.in లో కార్మికులే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ప్రభుత్వం ఈ మేరకు అవగాహన కల్పించడంలో విఫలమైంది. స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, ఇంటర్నెట్‌ వంటి సమస్యలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సివుంది. కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు ఎంత మంది ఉన్నారో ఈ ఏడాది డిసెంబర్‌ లోగా తమకు నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం ఇ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
 

                                    17.39 శాతం బ్యాంకు వివరాలు లేవు

రాష్ట్రంలో నమోదైన 14.13 లక్షల అసంఘటిత కార్మికుల్లో 17.39 శాతం మంది తమ బ్యాంకుఖాతా వివరాలను ఇవ్వలేదు. ఫలితంగా వీరికి కేంద్రం నుండి అందాల్సిన పథకాలు అమలయ్యే అవకాశం లేదు. నమోదైన వారిలో 49.12శాతం పురుషులు, 50.88శాతం మహిళలు, 0.01శాతం ఇతరులు ఉన్నారు. 16-18 వయస్సు వారు 0.99శాతం, 18-40 వయస్సు వారు 57.32 శాతం, 40-50 వయస్సు వారు 28.02శాతం, 50పైబడిన వారు 13.68 శాతం ఉన్నారు. వీరిలో 10.75 శాతం మంది నామినీ వివరాలను ఇవ్వలేదు. ఇప్పటి వరకు నమోదైన వారిలో ఎస్సిలు 21.22శాతం, ఎస్టిలు 4.42శాతం, ఒబిసి 49.29శాతం, జనరల్‌ 25.07శాతం ఉన్నారు. నెలకు రూ.10వేల లోపు ఆదాయం వచ్చే వారు 88.47శాతం, రూ.10వేలు నుండి రూ15వేలు ఆదాయం వచ్చే వారు 9.42శాతం, రూ.15వేలు పైబడి ఆదాయం వచ్చేవారు 0.43శాతం మంది ఇప్పటి వరకు నమోదైన కార్మికుల్లో ఉన్నారు.