May 11,2022 21:23

అసని తుపాన్‌ పశ్చిమలో అల్లకల్లోలం సృష్టించింది. జిల్లాలో వివిధ పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. ఈదురుగాలులు, వర్షాలతో పంటలు, జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్‌ ప్రభావంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది. పలుచోట్ల ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌ అందక రొయ్యలు తేలిపోతున్నాయి. సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఉప్పుమడులు పూర్తిగా నీట మునిగాయి. మామిడి పంట సైతం నేల రాలింది. దీంతో రైతులు ఆందోళన చెందతున్నారు.

ప్రజాశక్తి - భీమవరం
అసని తుపాన్‌ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే సమాయత్తమైంది. నరసాపురం తీర ప్రాంతంలో 20 మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బందాలను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డిఒ కార్యాలయాలతో పాటు జిల్లాలోని 19 తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అధికారులంతా అందుబాటులో ఉంటూ తుపాన్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. అయితే తుపాన్‌ ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకూ ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురిసింది. అత్యధికంగా ఆచంట మండలంలో 30.2 మిల్లీమీటర్లు, పోడూరులో 27.8, నరసాపురంలో 22.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 180 మిల్లీ మీటర్ల వర్షం కురవగా 9.47 శాతం వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వివిధ పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో నట్టేట ముంచింది. జన జీవనం స్తంభించింది. చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, చిరుద్యోగులు, వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. ఈదురుగాలులకు భీమవరం మండలం తాడేరు, తణుకు తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పలు గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం నిలిచిపోయింది. చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌ సమస్యలు నెలకొన్నాయి.
ఉక్కబోతతో మొలకెత్తుతున్న ధాన్యం
తుపాన్‌ హెచ్చరికతో రైతులు ధాన్యాన్ని ముందుగానే చెట్ల గట్లు, చేలల్లో భద్ర పర్చారు. అయితే ఇలా చేసి రోజులు గడుస్తుండడంతో ధాన్యం రాశుల్లో ఉక్కపోత ఏర్పడి మొలకలు వస్తున్నాయి. ధాన్యం రాశుల్లో అడుగు భాగం వర్షం ధాటికి తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో 2 లక్షల 43 వేల ఎకరాల్లో సాగు చేపట్టగా లక్షా 20 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 24 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు లక్ష్యంగా తీసుకున్నప్పటికీ, కేవలం లక్షా 81,602 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు.
రొయ్యకు అందని ఆక్సిజన్‌
ఒక పక్క తుపాన్‌, మరోపక్క విద్యుత్‌ కోతలతో రొయ్యలకు ఆక్సిజన్‌ అందని పరిస్థితి నెలకొంది. దీంతో రొయ్యలు తేలిపోయి చనిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో 49 వేల 400 ఎకరాల్లో రొయ్యల సాగు, 56 వేల 810 ఎకరాల్లో చేపల సాగు జరుగుతుంది. ప్రస్తుతం తుపాన్‌ కారణంగా సాగులో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. రొయ్యల సాగుకు చల్లటి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఈ నేపథ్యంలో సుమారు రోజుకు 18 గంటలపాటు ఏరియేటర్లు తిప్పాల్సి ఉంటుంది. అయితే తుపాను వల్ల విద్యుత్‌ కోతలు ఎక్కువయ్యాయి. దీంతో జనరేటర్ల ద్వారా ఏరియేటర్లను తిప్పుతున్నారు. అయితే డీజిల్‌ ధర పెరగడంతో ఆక్వా రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు.
నీట మునిగిన ఉప్పుమడులు
నరసాపురం తీర ప్రాంతంలో సాగవుతున్న ఉప్పుమడులు నీట మునిగాయి. నరసాపురం మండలం తూర్పుతాళ్లు ప్రాంతంలోని కారెశెట్టిపాలెం, చినమైనవానిలంక, పెదమైనవాని లంక ప్రాంతాల్లో ఉప్పుమడులు నీటి మునిగాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఐదు రోజుల్లో పంట చేతికొస్తుందన్న సమయంలో తుపాన్‌ నట్టేట ముంచింది.
నేల రాలిన మామిడి..
తుపాన్‌ ప్రభావం మామిడిపై పడింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేల రాలాయి. ముఖ్యంగా మొగల్తూరు, పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామాల్లోని మామిడితోటలో ఈపరిస్థితి ఏర్పడింది. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.