May 12,2022 21:08

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో నాలుగు రోజుల నుంచి ప్రభావం చూపిన అసని తుపాన్‌ ఎట్టకేలకు బలహీనపడింది. అయితే ఈ తుపాను రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. కంటి మీద కునుకు లేకుండా చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల 39,880 ఎకరాల్లో దాళ్వాసాగు రైతులు చేపట్టారు. దీనిలో లక్షా 76,484 ఎకరాల్లో కోతలు పూర్తయ్యి మాసూళ్ల ప్రక్రియ జరిగింది. సుమారు 63,396 ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 73 శాతం మాత్రమే మాసూళ్లు ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో ఎక్కువ శాతం కౌలు రైతులే వ్యవసాయాన్ని చేస్తున్నారు. జిల్లాలో సుమారు లక్షా 50 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం చేసే వారిలో సుమారు 70 శాతం మంది కౌలు రైతులే అధికంగా ఉన్నారు. అయితే అసని తుపాన్‌ రైతులను నట్టేట ముంచింది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.32 వేల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారు. అయితే చేతికొచ్చిన పంట తుపాన్‌ ప్రభావంతో దెబ్బతింది. వరి చేలల్లో, చేలగట్లపై, రహదారులపై భద్రపర్చిన ధాన్యం రాశులు అడుగు భాగం ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తాయి. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తే 8 నుంచి 15 బస్తాలు వరకు వరకు ధాన్యం తడిచి మొలకలు వచ్చిన పరిస్థితి ఉంది. పాలకోడేరు మండలం పాలకోడేరు, మోగల్లు, గరగపర్రు, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామాల్లో భద్రపర్చిన ధాన్యం అడుగుభాగం తడిచి ముద్దవడంతోపాటు మొలకలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మిగిలిన పంటను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వీరవాసరం, పెనుమంట్ర, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, యలమంచిలి మండలాల్లో ధాన్యం రాశుల్లో భద్రపర్చిన ధాన్యాన్ని గట్లపై, రహదారులపై వేసి ఆరబెడుతున్నారు. వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియక ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వరి కోతలు కోసేందుకు రైతాంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఉక్కపోతతో జిల్లా ప్రజానీకం ఆపసోపాలు పడుతోంది. విద్యుత్‌ కోతలు పెరిగిపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి.
కళ్లాల్లోనే మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమయానికి ప్రారంభం కాకపోవడం, నాలుగు రోజుల నుంచి తుపాన్‌ తిష్ట వేయడంతో సుమారు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా కళ్లాల్లోనే ఉండిపోయింది. జిల్లావ్యాప్తంగా 5.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో ఇప్పటి వరకు కేవలం రెండు లక్షల 10,551 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 326 రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. గురువారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు భీమవరం ఎఎస్‌ఒ రవిశంకర్‌ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇంకా 37 రైతుభరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు.

ధాన్యం మొలకెత్తడంతో రూ.2 లక్షలు నష్టం..
పి.శ్రీనివాస్‌, కౌలురైతు, పాలకోడేరు
ఎన్నో ఏళ్ల నుంచి కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. ఈ సీజన్లో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేపట్టాను. నెలకు రూ.30 వేలు వరకు పెట్టుబడులు పెట్టాను. పంట చేతికొచ్చే సమయంలో తుపాను వచ్చి నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం తడిచి మొలకెత్తాయి. ఎకరాకు రూ.10 వేలు చొప్పున రూ.రెండు లక్షలు నష్టం వచ్చింది.
ఎకరాకు 15 బస్తాల్లో మొలకలు..
ఎం.రాంబాబు, కౌలురైతు, గొల్లలకోడేరు
ఈ సీజన్లో ఎనిమిది ఎకరాలు కౌలుకు చేశాను. పంట బాగా పండిందని ఆశపడ్డాను. తుపాను వచ్చి ఆశలను అడియాసలు చేసింది. భద్రపరిచిన ధాన్యం తడిసిపోవడంతో ఎకరాకు 15 బస్తాలు మొలకలు వచ్చాయి. ధాన్యాన్ని అంతా ఆరబెడుతున్నాను. అయినకాడికి కొంటామని చెబుతున్నారు. తీవ్ర నష్టం రావడంతో ఏం చేయాలో తెలియట్లేదు.