Mar 02,2021 19:56

గువహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆమె పార్టీ తరపున '5-హామీలు' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. తేజ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను నిలిపివేస్తామన్నారు. అలాగే ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని, గృహిణి సమ్మాన్‌ పేరుతో ప్రతి గృహిణికి నెలనెలా రూ.2 వేలు చొప్పున నగదు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో బిజెపి పూర్తిగా విఫలమైందని ప్రియాంక విమర్శించారు. రెండో రోజు అసోంలో పర్యటిస్తున్న సందర్భంగా తేజ్‌పూర్‌లో ప్రచారానికి ముందు బిశ్వనాథ్‌ ప్రాంతంలో సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడ కూలీలతో మాట్లాడారు. తేయాకు తెంపుతూ సందడి చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.