
డిస్పూర్ : అసోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. కాచర్ జిల్లాలో పరిస్థితి భయానకంగా ఉందని, వరదల కారణంగా జిల్లాకు చెందిన 41వేల మంది ప్రభావితమయ్యారని అన్నారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని అన్నారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) నివేదిక ప్రకారం.. 138 గ్రామాలకు చెందిన 41,037 ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని, 1,685 మందిని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలించినట్లు తెలిపింది. వరదల ధాటికి ఆదివారం కాచర్జిల్లాకు చెందిన ఒక చిన్నారి సహా ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. 2,099.6 హెక్టార్లలో పంట నీట మునిగింది.
కోపిలి నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. 2004, 2017లో వచ్చిన అత్యధిక వరద స్థాయి 61.79 మీటర్లను దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రెవిన్యూ సర్కిల్స్‌లోని సుమారు 222 గ్రామాలు ప్రభావితం కాగా, 10321.44 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. ఎస్డిఆర్ఎఫ్ సహా అగ్నిమాపక శాఖ, అత్యవసర సర్వీసులు , జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది.