
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : క్రీడాకారుల జీవితాలను బాగు చేయాల్సిన కబడ్డీ అసోసియేషన్ నాయకుల మధ్య విబేధాలు నెలకొనడం క్రీడాకారుల పట్ల శాపంగా మరాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్ నాలుగు క్రీడాంశాల్లో నిర్వహిస్తోంది. నియోజకవర్గాల పోటీలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మంగళవారం నుంచి జరుగుతున్నాయి. వాలీబాల్, క్రికెట్ పోటీలు ప్రశాంతంగా జరిగినప్పటికీ కబడ్డీ పోటీలు మాత్రం అసోసియేషన్ల మధ్య విబేధాలు కారణంగా వాకౌట్ల నడుమ ముగిసింది. మంగళవారం సాయంత్రం గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల జట్లు మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో వివాదంతో ప్రారంభమైన రగడ చివరకు చీపురుపల్లి జట్టు నెల్లిమర్లతో ఆడకుండానే వాకౌట్ చేసింది. ఫైనల్ లో గజపతినగరం ,నెల్లిమర్ల నియోజకవర్గాల మధ్య జరగాల్సిన మ్యాచ్ను నెల్లిమర్ల జట్టు బహిష్కరించడంతో గజపతినగరం జట్టును విజేతగా ప్రకటించాల్సి వచ్చింది. చిన్న చిన్న విబేధాలు కారణంగా మంగళవారం రాత్రి జరగాల్సిన సెమీఫైనల్,ఫైనల్ మ్యాచ్ లు బుధవారం నిర్వహించాలని నిర్ణయం చేశారు. చివరకు ఒక అసోసియేషన్ నాయకులు వారి పిల్లలకు ఫోన్లు చేసి మ్యాచ్లు ఆడొద్దని చెప్పడంతో నియోజకవర్గ టీమ్ లో ఉన్న క్రీడాకారులు ఆడేందుకు రాలేదు. ఉదయం 10గంటలకు జరగాల్సిన మ్యాచ్లు ఆయా జట్లు క్రీడాకారులు రాకపోవడంతో 12గంటలకు ప్రారంభించారు.
నెల్లిమర్ల జట్టు ఫైనల్ లో ఆడకుండా కొందరు క్రీడాకారులు రాలేదని చెప్పి వచ్చిన వారంతా ఆడకుండా వాకౌట్ చేసారు. దీంతో గజపతినగరం జట్టును విజేతగా ప్రకటించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా సిఎం కప్ ప్రైజ్ మనీ టోర్నమెంట్ నిర్వహిస్తుంటే వాటిని జయప్రదం చేసి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అసోసియేషన్ నాయకులు వారిని అడొద్దని చెప్పడం సమంజసం కాదని పలువురు క్రీడాభిమానులు అంటున్నారు. వారి వ్యక్తిగత ప్రతిష్ట కోసం క్రీడాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని వాపోతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా క్రీడలు ఆడక సర్టిఫికెట్లు లేక ఎంతో మంది క్రీడాకారులు ఉద్యోగాలు అవకాశాలు కోల్పోయారు. ప్రభుత్వం స్పందించి అసోసియేషన్ల మధ్య విబేధాలు పరిష్కరించక పోతే క్రీడలను నమ్ముకున్న విద్యార్థులు రెండింటికీ చెడ్డ రేవడిలా మారే ప్రమాదం ఉంది. విజయనగరం అంటే క్రీడలకు ప్రసిద్ధి. అసోసియేషన్లలో విబేధాలు కారణంగా ఆ పేరు మంట కలిసే పరిస్థితి ఏర్పడుతోంది.