Jun 11,2021 22:13

ప్రజాశక్తి - యంత్రాంగం
ఆస్తి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం, సిపిఐ పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో పేద, మధ్యతరగతి ప్రజలు పన్నులు, అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉంటే ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు పెంచడం అన్యాయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ మాట్లాడారు. ఆస్తి పన్నులపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బత్స సత్యనారాయణ అబద్దాలు చెబుతున్నారన్నారు. ఆస్తి పన్ను ఏయే ప్రాంతంలో ఎంత పెరగబోతుందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మంత్రి దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని వారు సవాల్‌ విసిరారు. కడప జిల్లా రాజంపేటలో వామపక్షాలు, కాంగ్రెస్‌, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కు విపతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్‌ మహంతిపురం రాఘవరెడ్డి రోడ్డులో వామపక్షాలు నిరసన తెలిపారు. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు వైసిపి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం పిలుపునిచ్చారు. ఇంటి పన్ను నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరుతూ విద్యాధరపురంలోని ఉప్పలపాటి సుబ్బరాజు భవన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తణుకులో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కమిషనర్‌ వాసుబాబుకి వినతిపత్రం అందించారు.