Jul 22,2021 00:51

సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ రామారావు, చిత్రంలో నరవ ప్రకాశరావు తదితరులు

ప్రజాశక్తి - సీతమ్మధార
ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే పద్ధతి సరికాదని రిటైర్డ్‌ డిఎం అండ్‌ హెడ్‌ఒ డాక్టర్‌ పి.రామారావు అన్నారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను విధించరాదని, పాత విధానాన్ని కొనసాగించాలని, చెత్త, మురుగునీటిపై యూజర్‌ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ అపార్టుమెంట్స్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా), నివాస ప్రాంత కాలనీల అసోసియేషన్‌ (నివాస్‌) సంయుక్తంగా బుధవారం సీతమ్మధార రైతు బజారు వద్ద సంతకాల ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్‌ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే పన్నులు ఎగ్గొట్టే వారి నుండి, ఎగ్గొట్టే కంపెనీల నుండి వసూలు చేయాలని, ఇతర మార్గాలు అన్వేషించాలని సూచించారు. వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్షులు నరవ ప్రకాశరావు మాట్లాడుతూ పన్నుల బాదుడు సంస్కరణల్లో భాగమేనని, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ మోసాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
అక్కయ్యపాలెంలో...
అక్కయ్యపాలెం మహారాణి పార్లర్‌ సెంటర్‌లో సంతకాల ఉద్యమాన్ని పౌర గ్రంథాలయాల సేవా సమితి అధ్యక్షులు బిఎల్‌.నారాయణ ప్రారంభించారు. 'ఆస్తి విలువ, ఇంటి పన్ను ఒకదాని కొకటి సంబంధం లేని అంశాలని, ఈ రెండింటికి ముడి పెట్టి ఇంటి పన్ను వేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆస్తి పన్ను లో 8శాతం లైబ్రరీ సెస్సు ఉందని, ఇప్పటి వరకు మనం చెల్లించిన రూ.95 కోట్ల లైబ్రరీ సెస్సు జివిఎంసి లైబ్రరీ డిపార్టుమెంట్‌కు చెల్లించలేదని, నగరంలో లైబ్రరీలు శిధిలావస్థలో ఉన్నాయని తెలిపారు. చెత్త, మురుగునీరు, మంచినీరు, రోడ్లు వంటి వసతుల కల్పన కోసమే ఆస్తి పన్ను, ఇంకా చెత్తపైన ఛార్జీలు ఏమిటీ? అన్నింటికీ ఛార్జీలు వసూలు చేస్తే, ఆస్తి పన్ను దేనికి కట్టాలని అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ప్రకాశరావు, బివి.గణేష్‌, కెవి.రమణమూర్తి, ఆర్‌ఎన్‌.మాధవి, ఎం.కామేశ్వరి, జెపి.శర్మ, పి.పాండురంగన్‌ తదితరులు పాల్గొన్నారు.