Jun 11,2021 00:39

మంత్రి బొత్సకు సమస్యను వివరిస్తున్న డాక్టర్‌ గంగారావు, చిత్రంలో గణేష్‌

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల్లో ఆస్తిపన్నును ఇప్పుడున్న దానిపై 15శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జివిఎంసి, మున్సిపాల్టీ పాలక మండళ్లు ఏర్పడి ఇంకా 3 నెలలు గడవక ముందే ఆస్తిపన్ను పెంపుదల నిర్ణయం నగరాలు, పట్టణ ప్రజలకు శరాఘాతంగా మారింది. పైగా ఈ పన్ను పెంపుదలను ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలకు ముందే చెప్పిందని, చట్టంగా మారి అమల్లోకి వస్తుందని, కార్పొరేషన్లలో తీర్మానం చేయాల్సిందేనంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విశాఖలో వెల్లడించారు. చెత్త పన్ను విషయంలో కౌన్సిల్‌ తీర్మానం చేయాలని, ఆస్తిపన్ను చట్టం అని, తన పని తాను చేసుకుపోతుందని, దీనికి కౌన్సిల్‌లో ముందే తీర్మానం చేయాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స బాహాటంగా ప్రకటించారు. ఇది ప్రజలపై క్రమంగా భారాలు పెంచుతుందని, నగరాలు, పట్టణాల్లో సరైన సౌకర్యాలను పెంచాల్సిన నగర పాలకులు ఇలా పన్నులు పెంచడం సరైంది కాదంటూ నగర వాసుల హక్కులు, మౌలిక వసతులపై పోరాడుతున్న వార్వా సంఘాల ప్రతినిధులు, సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఇదే విషయంపై సిపిఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, వార్వా ప్రధాన కార్యదర్శి బిబి.గణేష్‌ గురువారం మంత్రి బొత్సను కలిసి వినతిపత్రం అందజేశారు. భూమి విలువ, స్థలం యొక్క మార్కెట్‌ విలువను లెక్కగట్టి పన్నులు వెయ్యడం అంటే ప్రజలపై పెనుభారం తప్ప మరొకటి కాదని వారు పేర్కొన్నారు. రెంటల్‌ ఛార్జీల ఆధారంగానే పాత విధానం కొనసాగించాలన్నారు. దీనికి స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తిపన్ను భారం ప్రజలపై పడదని, ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏ వాదనలో నిజం ఉంది? బొత్స చెప్పిందే నిజమా? వాస్తవం ఎలా ఉండబోతుంది? అన్నదానికి, సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి, ఆర్థిక నిపుణులు, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌.బిగంగారావు చెబుతున్న ఏమిటీ అనేది వారి, వారి మాటల్లోనే...
మంత్రి బొత్స ఏం చెబుతున్నారు
1.అద్దె ప్రాతిపదికపై గతంలో ఉండేది. ఇది అవినీతిని పెంచిపోషించింది. అందుకే ఆస్తి విలువ ప్రాతిపదిక పెట్టాం.
2.రాష్ట్రంలో ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.1242కోట్లు. కొత్త చట్టం ప్రకారం రూ.1428 కోట్లే అవుతుంది.
3.ప్రజల మీద భారం కాదు. గతంలో రూ.వెయ్యి పన్ను కట్టేవారికి తాజాగా రూ.150 పెరుగుతుంది.
4. పన్ను పేయర్లతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయించింది.
5.ఆస్తిపన్ను నుంచి ఎవ్వరూ తప్పించుకోడానికి వీల్లేని విధానం.
6.రాష్ట్రంలో పన్నులపై ఒక మంచి చట్టం ద్వారా సిస్టంను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానం.
డాక్టర్‌.బి.గంగారావు ఏమంటున్నారు
1.అద్దె ప్రాతిపదికపై అవినీతి ఉంటే దాన్ని సరిచేయాలి. ఆస్తిపన్ను పెంచి ప్రజలపై భారాలు వేసి కథలు అల్లుతున్నారు. దీంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉంటుంది. భవనం చదరపు అడుగు తగ్గించి లెక్కలు వేస్తే అవినీతి జరగదా?
2.15శాతం అనేదాన్నే అమలు చెయ్యాలని ఏమీ లేదు. రూల్స్‌ నుంచి తీసెయ్యవచ్చు. కాబట్టి రూ.1428 కోట్లు కాదు రూ.3వేల కోట్లు పెరగనుంది. ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజలకు అర్థమవుతుంది. చట్టంలో 15శాతం లేదు. 15శాతం అనేది రూల్స్‌లోనే ఉంది. దీన్ని అమలు చెయ్యాలని ఏమీ లేదు.
3. ప్రజల మీద భారం కాదు అనేది ప్రచారం తప్ప దీంట్లో నిజం లేదు. సంవత్సరం సంవత్సరం పన్ను పెరగదా? ఐదేళ్లకు ఇది రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్‌ విలువ పెరుగుతుంటోంది.
4.అదంతా పచ్చి అబద్ధం. టాక్స్‌ పేయర్లు కాదు, ప్రజాభిప్రాయం కౌన్సిల్‌ ద్వారా చేపట్టాలి. వైసిపి టాక్స్‌ పేయర్‌లచే చెప్పించి అభిప్రాయం తీసుకున్నాం అంటే ఎలా?
5.పాత పద్ధతిలో కూడా ఎవ్వరూ తప్పించుకోడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం రాయితీలు ఇచ్చేస్తుంది. విశాఖలో ఎస్‌ఇజెడ్‌లు చెల్లించడం లేదు. గంగవరం పోర్టు ఏడాదికి రూ.50కోట్లు చెల్లించాలి. ప్రభుత్వ కార్యాలయాలు రూపాయి చెల్లించడం లేదు. ఇవన్నీ చెల్లిస్తాయన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? రాజకీయ నాయకుల కంపెనీలు పెడితే ఆస్తిపన్ను రూ.కోట్లలో చెల్లించాల్సి వస్తే రూ.లక్షల్లోనే చెల్లిస్తారు.
6.ప్రజల ఆదాయాన్ని కొల్లగొట్టే చట్టం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్బన్‌ సంస్థలకు నిధులివ్వకుండా వారికయ్యే ఖర్చులను ప్రజలనుంచే వసూలు చేసే వ్యవస్థను అభివృద్ధి చేయడం తప్ప మరొకటి కాదు.