Nov 25,2021 16:15

సిడ్నీ :  వివాదాస్పద మత వివక్ష వ్యతిరేక బిల్లును ఆస్ట్రేలియా ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందినట్లైతే.. మత విశ్వాస సంస్థలు తమ విశ్వాసాలకు అనుగుణంగా వ్యక్తులను నియమించుకోవచ్చు.. వారికి గుర్తింపునివ్వవచ్చు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో మతస్వేచ్ఛపై ఆందోళనలు జరుగుతున్నాయి. చర్చ్‌లు, పాఠశాలలు, కార్యాలయాల్లో ఉద్యోగులు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను వ్యక్తపరచలేకపోతున్నామంటూ ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది మేలో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మత ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ బిల్లుతో కార్యాలయాలకు వెలుపల ఉద్యోగులు తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు. ఒక్కొక్కరి మత విశ్వాసాలు ఒక్కో విధంగా ఉంటాయని, అందుకని వారిని దూషించడం, వారిపై నిషేధం విధించడం వంటివి చేయరాదని పార్లమెంట్‌ దిగువ సభలో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మారిసన్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే కొనసాగుతున్న లింగ వివక్ష చట్టంలో కూడా సవరణలు చేస్తానని మారిసన్‌ 2018లో ప్రకటించారు. ఎల్‌జిబిటి గ్రూప్‌ ఈ సవరణలు చేపట్టేందుకు అంగీకరిస్తున్నప్పటికీ.. నూతన మత పరమైన వివక్ష వ్యతిరేక చట్టాన్ని విమర్శిస్తున్నాయి. మత విశ్వాసాల ఆధారంగా నియామకాలు చేపడితే.. గే విద్యార్థులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష ఇంకా పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో కూడా ఈ బిల్లుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్జర్వేటివ్స్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగవచ్చు.