Jan 10,2022 07:16

కొన్ని కథలు కాలక్షేపం బఠాణీలు. రైలు, బస్సు ప్రయాణాల్లో మాత్రమే చదవడానికి పనికొస్తాయి. కొన్ని కథలు మాత్రం ఆలోచనల అగ్నిజ్వాలలను రగిలిస్తాయి. మన వ్యవస్థ వికృత రూపాన్ని ప్రశ్నిస్తాయి. సమాజంలోని అసమానతలను అద్దంలో చూపిస్తాయి. 'బ్రేకింగ్‌ న్యూస్‌' సంపుటిలోని కథలన్నీ ఇలాంటివే. 'ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ', 'దుర్గాపురం రోడ్‌' కవితా సంపుటాలతో ప్రసిద్ధులైన ప్రముఖ కవి దేశరాజు రచించిన తొలి కథా సంపుటి 'బ్రేకింగ్‌ న్యూస్‌'. గత ఏడాది కాలంలో రాసిన 15 కథల సమాహారం ఈ సంకలనం.
ఐదేళ్ల కిందర ఒక రోజు ప్రధాన మంత్రి 'పెద్ద నోట్ల రద్దు' ప్రకటన చేశారు. నోట్ల రద్దు వల్ల మధ్య తరగతి ప్రజలు, పేదలు పడరాని పాట్లు పడ్డారు. 'డీ హ్యూమనైజేషన్‌' కథ వీరి కష్టాలను చిత్రీకరించిన కరుణ రసాత్మక కథ. కథలో నోట్లు మార్చుకోవడానికి వెళ్లిన ముసలమ్మ అంతసేపు అక్కడ నిలబడిన అలసటతో మర్నాడు మరణిస్తుంది. కథలో కొసమెరుపు ఏమిటంటే మరణించిన ఆవిడ ఒంటి మీద నగలు పెట్టి ఫొటోలు తీస్తారు. అధిక బంగారముంటే లెక్కలు చెప్పాలని, వారసత్వంగా వస్తే నియమం వర్తించదని తెలుసుకొని అలా చేస్తారు. ఈ కథ చదివాక మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న మార్క్స్‌ సిద్ధాంతం గుర్తుకు వచ్చి మనసు కలత చెందుతుంది.
ఇప్పుడు పిల్లల చదువంతా మార్కులు, గ్రేడుల చుట్టే తిరుగుతుంది. వ్యవహార జ్ఞానం, లోక జ్ఞానం వాళ్లకి వుండదని చెప్పిన కథ 'ఫారమ్‌ కోడిపిల్ల'. కోచింగ్‌ సెంటర్లో చదువుకుంటున్న అబ్బాయిని వాళ్ల నాన్న రోజూ కారులో వచ్చి ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఒకరోజు మాత్రం వీలు కుదరక వెళ్లలేకపోతాడు. అబ్బాయికి తండ్రి 'బస్సెక్కి గానీ, ఆటో మీదగానీ రమ్మని' మెసేజ్‌ పెడతాడు. వాడికి ఏ నంబరు బస్కెక్కాలో తెలీదు. నంబర్ల పక్కన రాసిన తెలుగు అక్షరాలు అర్థం కావు. తండ్రికి ఫోను చేద్దామంటే ఫోన్లో చార్జింగ్‌ అయిపోతుంది. పక్కవాళ్ల ఫోన్‌ తీసుకొని చేస్తాడు. కానీ, తను ఎక్కడ ఉన్నాడో చెప్పడానికి ప్రాంతం వివరాలు తెలీవు. చివరకు ఒక వ్యక్తి సహాయంతో గమ్యం చేరతాడు. క్లాసులో ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునే పిల్లలు లోకజ్ఞాన శూన్యులు కావడం మన నిత్య జీవితాలలో చూస్తూనే ఉంటాం. 'టపటపలాడుతున్న రెక్కలు' కాలేజీ చదువుల గురించి, పరీక్షలో పాసవకపోతే ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థుల గురించి రాసిన కథ. ఆత్మవిశ్వాసం కలిగించాల్సిన చదువులు తమ మీద తాము నమ్మకం కోల్పోయేలా చేయడం, పరీక్షలో తప్పితే ఆత్మహత్య చేసుకునే ఆలోచన కలగించే ఈనాటి విద్యావ్యవస్థ అపసవ్య లక్షణాలను ఈ కథ చిత్రీకరించింది.
'బ్రేకింగ్‌ న్యూస్‌' ఈ సంపుటికి పేరు పెట్టిన కథ. ఈ కథలో మధ్య తరగతి భార్యాభర్తలు. భర్తకు అనారోగ్యం. డాక్టరు లివర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయాలని అంటాడు. భర్తకు తెలియకుండా భార్యే తన లివర్‌ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఆపరేషన్‌కని ఆస్పత్రిలో చేరతాడు భర్త. భార్యే తనకు లివరు ఇస్తోందని తెలుసుకొని భార్యకి తనంటే ఎంత ప్రేమోనని ఆనందిస్తాడు. చివరకు ఆపరేషన్‌ జరగదు. అవసరం లేకపోయినా లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాడని ఆ డాక్టర్‌ని అరెస్ట్‌ చేస్తారు. కథ సుఖాంతం కావడంతో భార్యాభర్తలతోపాటు పాఠకులు ఆనంద సాగరంలో తేలిపోతారు. మన దేశంలో వైద్యం ఓ వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగుల్ని మరీ దోచుకుంటున్నాయి. ఆ దోపిడీతో మధ్య తరగతి చిక్కుకుపోయిన తీరుని చెప్పిన కథ ఇది.
ఒక వయసులో చాలామంది కలలు కంటారు. అన్యాయాలను ఎదిరించాలని, సమ సమాజం స్థాపించాలని, తాను సైతం ఒక ధిక్కార పతాకం కావాలని, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పోకడలు పోతున్న ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పోరాడాలని అణువణువూ రగిలిపోతుంటాయి. కొంతకాలమయ్యాక, ఒక గహస్తు అయ్యాక 'ఇట్లు తమ విధేయుడు'గా మారిపోతారు. ఎక్కడా ఓ నిరసన వాక్యం పలక్కుండా, అన్యాయాల పట్ల ఆగ్రహజ్వాలగా మారకుండా అన్నిటికీ సర్దుకుపోతారు. ఈ మనుషుల ప్రవృత్తినే 'అనేకానేక బల్లులు, ఒకే ఒక్క ఫ్లాష్‌ బ్యాక్‌' కథలో చిత్రించారు.
మాటలు మహాశక్తివంతమైనవి. ఉత్సాహకరమైన, ఉల్లాసకర మైన మాటలు మనసు మీద గొప్ప ప్రభావం కలిగిస్తాయి. మనసులో మంచి ఆలోచనలుంటే దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరణశయ్య మీద వున్న ఒక రోగిని తన మాటలతో బతికిస్తాడు మానసిక వైద్య నిపుణుడు 'ఆశల రెక్కలు' కథలో. 'ఏదీ దారి?' మరో ఆలోచనాత్మక కథ. నేటి మధ్య తరగతి తల్లిదండ్రులందరూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. చిన్నప్పటి నుంచీ తమ ప్రాణప్రదమైన సంతానం ఆటల్లో, పాటల్లో, ఏదో ఒక కళారంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. చదువుకంటే మిగిలిన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ, ఎన్నో ఏళ్లు కృషి చేసినా కొందరికి ఆయా రంగాల్లో పేరు రాక మామూలు పిల్లలు గానే మిగిలి పోతారు. తగిన ప్రాధాన్యత నివ్వకపోవడం వల్ల చదువులోనూ రాణించక, రెంటికీ చెడ్డ రేవడులైపోతారు. ఈ కథలో క్రికెట్టే ప్రాణంగా ఆడుతున్న కొడుక్కి ఆ ఆటలో సరైన అవకాశాలు రాకపోతే, ఏం చేయాలో తండ్రికి అర్థం కాదు. ఇది కేవలం ఒక్కరి సమస్య మాత్రమే కాదు. ఈనాటి సమాజంలోని ప్రతి తల్లిదండ్రులకు సవాల్‌ విసిరే ప్రశ్న 'ఏదీ దారి?'.
'అన్నయ్య రావాలి' విప్లవోద్యమానికి సంబంధించిన కథ. 'నీ కోసం నేను లేనూ' కథ కూడా అటువంటి కథే. ఈ కథలో నిరపరాధిని, ఏ నేరం చేయని అమాయకుణ్ణి హింసిస్తారు. ఉద్యమానికి సంబంధించిన వాడేమోనని అనుమానంతో చాలా కాలం వెంటాడి వేధిస్తారు. చివరికి అతని ఇంటి మీద దాడి చేస్తారు. ఇంట్లో వున్న వస్తువులన్నీ ధ్వంసం చేస్తారు. వృద్ధురాలైన తల్లిని కొట్టి చంపేస్తారు. ఈ దేశంలో డబ్బున్న వాడికి ఓ న్యాయం, సామాన్యుడికి ఓ న్యాయం. సంవత్సరాల తరబడి విచారణలు జరుగుతాయి. నేరస్థులు బోరవిరుచుకుని వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే నిర్దోషులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతారు. ఈ కథ చదువుతుంటే 'జై భీమ్‌' సినిమా గుర్తుకొస్తుంది.
వాట్సప్‌ సందేశాలపై సంధించిన వ్యంగ్య బాణం 'జ్ఞానగుళిక' కథ. పొగరుబోతైన కొడుక్కి బుద్ధి చెప్పిన కథ 'జ్ఞానం'. ఎక్కడో దూరంగా వున్న కొడుకు తన దగ్గరకు రావడమే పండుగ అనుకునే ఒక తల్లి కథే 'పండుగొచ్చింది'. ప్రాణాధికమైన భరత్‌ మరణించినా, దిగులు పడకుండా చేతనైన పనులు చేయాలనీ, మనసుని ఉత్సాహంతో నింపుకోవాలనే సందేశమిచ్చే కథ 'పునరుజ్జీవం'. ఆధునిక సమాజంలో ఉరుకులు పరుగులు పెడ్తూ క్షణ తీరిక లేదని కాలం గడిపే ఆధునిక యువతరం కథే 'గృహమేగా స్వర్గసీమ'. వృద్ధాశ్రమాలంటే ఎక్కడా గతిలేక వెళ్లేవి కావని, అక్కడ కూడా హాయిగా వుండొచ్చని నిరూపించే కథ 'చివరి నిర్ణయం'. 'దెయ్యాల పండుగ' ఓ చక్కని హాస్య కథ. కొత్త వాళ్లతో స్నేహం చేయాలనే మోజుతో ఫేస్‌బుక్‌ సుందరి కోసం వెళ్లిన ఒక మగానుభావుడు పొందిన పరాభవమే 'డబుల్‌ రోస్ట్‌' కథ.
ఈ సంపుటిలోని కథలన్నీ మెదడుకు పదును పెట్టించేవే! నేటి సంక్షుభిత సమాజంపై, అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థపై, అ'న్యాయ వ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణాలు ఈ కథలు. మధ్య తరగతి జీవనాన్ని, వారి ఆలోచనారీతులను ఒడిసి పట్టాయి. రచయిత కవి కావడంతో అక్కడక్కడా కవితాత్మక వర్ణనలు కథా కథనంలో అలవోకగా ఒదిగిపోయాయి. కవిగానే గాక కథకునిగా కూడా తన ముద్రను పదిలపరచుకున్న దేశరాజు గారు కథా ప్రపంచంలో చిరకాలం నిలిచిపోయే మరిన్ని కథలు రాయాలని ఆశిద్దాం.
                                                             - మందరపు హైమవతి  -  8247367061