Sep 26,2022 12:24

గువహటి :  వన్యప్రాణుల  సంరక్షణా చట్టం 1972ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఉల్లంఘించినట్లు ఇద్దరు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్సాం సిఎం, సద్గురు జగ్గీ వాసుదేవ్‌, పర్యాటక మంత్రి జయంత మల్లా బారౌలు నిబంధనలకు విరుద్ధంగా శనివారం రాత్రి కజిరంగా జాతీయ పార్కులో పర్యటించినట్లు గోల్ఘాట్‌ జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయంత్రం 4.00 గంటల తర్వాత పార్కులోకి ప్రవేశం నిషిద్ధమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీపల్‌ కృషక్‌ శ్రామిక్‌ సంఘ్  ప్రధాన సలహాదారు సోనేశ్వర్‌ నారా, మరో కార్యకర్త ప్రబిన్‌ పెగులు డిమాండ్‌ చేశారు.  చట్టం అందరికీ సమానమని, ఇలాంటి చర్యలను సహించబోమని అన్నారు. తాము పార్కు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్నామని, పార్క్‌ కోసం అనేక త్యాగాలు చేశామని, స్థానికులను వేటగాళ్లుగా ముద్రవేసి అటవీ సిబ్బంది చంపారని అన్నారు.

కజిరంగా జాతీయ పార్కులో భారత్‌కి చెందిన ఒంటికొమ్ము రైనాలకు ప్రసిద్ధి. వన్యమృగాల సంరక్షణా చట్టం 1972 ప్రకారం.. జంతువుల భద్రత, వాటి నివాసాలను తాకకుండా ఉండేందుకు గాను నిర్ణీత సమయం అనంతరం పార్కులో పర్యటనను రద్దు చేశారని అన్నారు. అందుకు విరుద్ధంగా వీరు రాత్రి సమయంలో పార్కులో పర్యటించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సద్గురు, అస్సాం సిఎం, బారూహ్ లతో  కలిసి ఓపెన్‌ సఫారీ ఎస్‌యువి వాహనంలో పర్యటిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొనడం గమనార్హం. అయితే తాము నిబంధనలను ఉల్లంఘించలేదని అస్సాం ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి ప్రపంచ వ్యాప్తంగా శిష్యులు ఉన్నారని, పార్కుకి పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని అన్నారు.