Aug 08,2022 07:40

* 60 ఏళ్లు దాటినవారు 12 కోట్ల మంది
* పెన్షన్‌ పథకం వర్తించనివారు 90 శాతం
* కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.300
న్యూఢిల్లీ :
పదేండ్ల క్రితంతో పోల్చితే పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఎప్పుడో 2012లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. అటు తర్వాత 2014లో మోడీ సర్కార్‌ వచ్చింది. ఈ 8ఏండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వృద్ధుల ఆర్థిక అవసరాలు పెరిగాయి. అయినప్పటికీ సామాజిక పెన్షన్లలో కేంద్రం ఎలాంటి మార్పులూ చేయటం లేదు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం...ఇవన్నీ కుటుంబ ఆదాయాన్ని మింగేస్తున్నవేళ, వృద్ధులకిచ్చే సామాజిక పెన్షన్‌ కొంత ఊరట కలిగిస్తుందని, దీనిని కనీసం రూ.5వేలకు పెంచాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. జాతీయ సామాజిక సహకార కార్యక్రమం కింద కేంద్రం అమలుజేస్తున్న వివిధ రకాల పెన్షన్‌ పథకాలకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల (బీపీఎల్‌)కు చెందినవారు అర్హులు. అర్హుల్లో కొంతమందికి మాత్రమే నేడు సామాజిక పెన్షన్‌ మొత్తం రూ.300 అందుతోంది. వికలాంగులు, వితంతువులుకు ఇస్తున్న మొత్తం ఏమూలకూ సరిపోవటం లేదు. దాంతో ఈ మొత్తానికి మరికొంత రాష్ట్రాలు జమచేస్తూ లబ్దిదారులకు సామాజిక పెన్షన్లు అందజేస్తున్నాయి. 2009 నుంచి ఈ విధానం మొదలైంది.
దశాబ్దాలు దాటినా అదే మొత్తం
             కేంద్రంలో మోడీ సర్కార్‌ ఏర్పడ్డాక, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల్ని 'కేంద్ర ప్రాయోజిత పథకాల' (2014లో) విభాగంలోకి మార్చింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, కుటుంబ, అన్నపూర్ణ..అనే ఐదు రకాల పెన్షన్‌ పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్‌ పథకాలు. వృద్ధాప్య పెన్షన్‌ పథకం 1995లో మొదలైంది. బీపీఎల్‌ కుటుంబాల్లోని 65ఏళ్లు దాటిన వారందరూ ఈ పథకానికి అర్హులే. పథకం ప్రారంభమైన తొలినాళ్లలో కేవలం రూ.75 ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని 2007లో రూ.200కు పెంచారు. 2011లో వయో పరిమితి 60ఏళ్లుకు తగ్గించారు. అలాగే 80 ఏళ్లు దాటినవారికి రూ.500 ఇవ్వటంత మొదలైంది. వికలాంగుల, వితంతు పెన్షన్‌ పథకాలు 2009లో మొదలయ్యాయి. 40-64 ఏళ్లు వితంతు మహిళలు ఈ పథకానికి అర్హులు. అన్ని రకాల సామాజిక పెన్షన్‌ మొత్తాల్ని రూ.200 నుంచి రూ.300కు 2012లో కేంద్రం పెంచింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పథకాల అమలుపై మోడీ సర్కార్‌ ఎలాంటి సమీక్ష జరపలేదు.
          పెన్షన్‌ మొత్తాల్ని పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉన్నా పట్టించుకోవటం లేదు. కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిందీ లేదు. ఒక అధ్యయనం ప్రకారం, మనదేశంలో 60ఏళ్లు దాటినవారు దాదాపు 12కోట్లమందికిపైగా ఉన్నారు. ఇందులో 90శాతం మందికి ఎలాంటి పెన్షన్‌ పథకమూ వర్తించటం లేదు. వీరందరూ కూడా బీపీఎల్‌ కుటుంబాలకు చెందినవారే. కేంద్రం తీరు వల్ల అనేకమంది వికలాంగులు సైతం సామాజిక పెన్షన్‌ను పొందలేక పోతున్నారు. వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం..ఇందులో మొత్తం 21 రకాలున్నారు. కానీ కేంద్రం కేవలం 7రకాల వికలాంగులకు మాత్రమే పెన్షన్‌ పథకాల్ని వర్తింపజేస్తోంది. ఇప్పుడున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని రూ.5వేలకు పెంచాలని సామాజికవేత్తలు చెబుతున్నారు.