Jul 29,2021 22:17

'ఆత్మ'

       అనంతపురం ప్రతినిధి : చనిపోయిన వ్యక్తి ఆత్మ వాహనాన్ని అమ్మేసింది. ఇదేమిటని అనుకుంటున్నారా... అవును ఒకటిన్నర సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి ఈనెల 24వ తేదీన ఇతరులకు వాహనాన్ని అమ్మేసింది. ఇదేదో దెయ్యమో.. భూతమో అనుకోవద్దు. కొందరు అవినీతి అధికారులు చేసిన నిర్వాకం. అనంతపురంలో ఇటీవల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాహనం అమ్మకం...కొనుగోలు చేయాలంటే విధిగా యజమాని ఆధార్‌ లింకుతోనున్న బయోమెట్రిక్‌ చేయాల్సి ఉంటుంది. అది లేకుండా వాహనం అమ్మకం, కొనుగోలు సాధ్యపడదు. అయితే అనంతపురంలో చనిపోయిన వ్యక్తి పేరున బయోమెట్రిక్‌ చేసి వాహనం అమ్మకం సాగించారు. ఇది ఎలా సాధ్యమైందన్నది అంతుబట్టని రహస్యంగా మారింది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... కె.మాధవిలత అనే మహిళ పేరున 2019 సెప్టంబరులో తుఫాను వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ వాహనం ఎపి39టిసి 4512 నంబరుతో అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అనంతరం ఈమె అదే ఏడాది నవంబరులో మృతి చెందింది. అయితే ఈ వాహనం ఒక పైనాన్స్‌ సంస్థలో రుణం కూడా పొందియున్నారు. ఆ సంస్థ రుణం చెల్లించకపోవడంతో సీజ్‌ చేశారు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు ఈ వాహన రుణాన్ని చెల్లించారు. అనంతరం ఈ వాహనంపైన రుణం తీరినట్టుగా హైపోథిటికేషన్‌ తొలగించి వాహనాన్ని నేరుగా కడప జిల్లాకు చెందిన కె.రామచంద్రారెడ్డి పేరున ఈనెల 24వ తేదిన బదిలీ అయింది. ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీరిన అనంతరం వాహనం అమ్మకం ఇతరులకు చేయాలంటే ఫైనాన్స్‌ సంస్థతోపాటు ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వాహన యజమాని కూడా బయోమెట్రిక్‌ చేయాలి. అనంతరమే ఇతరుల పేరుపై సదరు వాహనం రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. అది లేని సమయంలో వాహన యజమాని చనిపోతే లీగల్‌ హైరుకు మార్చిన తరువాత వాహనం మారుతుంది. అదేది లేకుండానే నేరుగా చనిపోయిన వ్యక్తి పేరుతో ఇతరులకు బదిలీ అవడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయివున్న వాహన యజమాని బయోమెట్రిక్‌ ఇప్పుడు ఎలా తీసుకొచ్చారన్నది అంతుబట్టని రహస్యంగా ఉంది.
డిప్యూటీ ట్రాన్సుపోర్టు అధికారి ఏమన్నారంటే..
ఈ విషయంపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారి శివరాం ప్రసాద్‌ స్పందిస్తూ బయోమెట్రిక్‌ లేకుండా వాహన మార్పు సాధ్యపడదని చెప్పారు. దీనిపై వివరాలిస్తే లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమాని చనిపోతే లీగల్‌ హైర్‌ ఉన్న వారు ఎవరైనా ఆధారాలు తీసుకుని వస్తే వారి పేరు మీద మాత్రమే మార్చవచ్చునని చెప్పారు. అలా కాకుండా నేరుగా మార్చే అవకాశం లేదని వివరణిచ్చారు.