Jul 03,2022 22:18

ఆటోస్టాండ్‌ను ప్రారంభిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేస్తామని సిఐటియు మండల కార్యదర్శి బాబావలి తెలిపారు. పట్టణంలోని డ్వాక్రా బజార్‌ ముందు నూతనంగా భగత్‌ సింగ్‌ గోనిపేట ఆటో స్టాండ్‌ ఏర్పాటు చేశారు. ఆటో స్టాండ్‌ ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఐక్యంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పోరాటాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 27న తీసుకొచ్చిందని, ఈ జీవో ఆటో కార్మికులకు ఉరితాడి లాంటిదని అన్నారు. నిబంధనల పేరుతో ఏ ప్రమాదం జరిగినా ఆటో డ్రైవర్‌ బాధ్యత వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో 10వేల రూపాయలు ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో వేల రూపాయలు దండుకుంటోందని విమర్శించారు. ఆటో కార్మికులపై ఆర్టీవో, ప్రైవేట్‌ ఫైనాన్స్‌, పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు తిప్పన్న, నాగప్ప, కెవిపిఎస్‌ నాయకులు గంగాధర్‌, సిఐటియు నాయకులు వెంకటరాముడు, నరసింహులు, కృష్ణప్ప, తిప్పన్న ఆటో కార్మికులు వెంకటేష్‌, నాగరాజ్‌, ప్రసాద్‌ నాయక్‌, దివాకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.