Sep 22,2022 17:46

శ్రీనగర్‌ :  ఖైదు చేయబడిన కార్మీర్‌ వేర్పాటువాద నేత, తన తండ్రి అల్తాఫ్‌ అహ్మద్‌ షాకి చికిత్సనందించేందుకు అనుమతించాలని కాశ్మీర్‌ జర్నలిస్ట్‌ రువా షా కోరారు. తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, జైలు బయట ఆస్పత్రిలో తగిన చికిత్స అందించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (పిఎంఒ), హోంమంత్రి కార్యాలయం (హెచ్‌ఎంఒ)లకు వరుస ట్వీట్లు చేశారు.

తన తండ్రి నిమోనియా, తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, షుగర్‌ కూడా పెరిగిపోయిందని, ప్రస్తుతం తీహార్‌ జైలులోని ఐసియులో వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. విచారణ సమయంలో ఎటువంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు కానీ.. ఆలస్యం కాకుండా ఆయనకు వైద్య సంరక్షణ అందించడం అత్యవసరమని పేర్కొన్నారు.

కాశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ -ఇ- హురియత్‌ వ్యవస్థాపకుడైన సయ్యద్‌ అహ్మద్‌ షా గిలానీ అల్లుడు అల్తాఫ్‌ అహ్మద్‌ షా. ఉగ్రవాదం కోసం పాకిస్తాన్‌ నుండి నిధులు సేకరిస్తున్నారన్న ఆరోపణలతో అల్తాఫ్‌ సహా ఏడుగురు వేర్పాటువాద నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) 2017లో అదుపులోకి తీసుకుంది. అప్పటి నుండి అల్తాఫ్‌ తీహార్‌ జైలులోనే ఉన్నారు.

జైలులో అల్తాఫ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి, జైలులో అందిస్తున్న వైద్యం గురించి వివరిస్తూ రాసిన ఓ లేఖ 2020 మేలో 'కారవాన్‌' మేగజైన్‌లో ప్రచురితమైంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించింది. జైలులో వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో ఏప్రిల్‌ 2020లో తన తండ్రి ఆస్పత్రి పాలయ్యాడని ఆ లేఖలో పేర్కొంది.

సరైన వైద్య పరీక్షలు లేకుండా జైలులోని వైద్యులు అందించే సాధారణ వైద్యంతో తనతండ్రి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం లేదని పేర్కొంది. జైలులో వైద్యం అందించేవారు జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు కావడంతో ఆయనకు మరింత వైద్యసహాయం అందించలేమని చెప్పినట్లు తెలిపారు. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించడం లేదని, బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేశామని ..కానీ ఇప్పటికీ విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు.